
గ్రీన్‌ఫీల్డ్ హైవే బ్రిడ్జి ఎత్తు తగ్గించొద్దు
నెక్కొండ: నాగపూర్–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే బ్రిడ్జి ఎత్తు తగ్గించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అలంకానిపేట, తోపనపల్లి, వెంకటాపురం, అప్పల్‌రావుపేట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు ఆదివారం కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ని కలిసి గ్రామస్తులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఆయా గ్రామాల ప్రజలు పలువురు మాట్లాడుతూ.. గ్రీన్‌ఫీల్డ్ హైవే 163జీ బ్రిడ్జి నెక్కొండ– కేసముద్రం ప్రధాన గ్రామాల నుంచి వెళ్తోందని, అలంకానిపేట–అప్పల్‌రావుపేట మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జి ఎత్తు 20 ఫీట్లకు బదులు 14 ఫీట్లకు తగ్గించి పనులు చేపడుతున్నారని తెలిపారు. పరిసర గ్రామాల రైతులు పంట ఉత్పత్తుల విక్రయానికి కేసముద్రం, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ తీసుకెళ్తారని, కేవలం ట్రాక్టర్లు, బస్సుల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని పనులు చేపడుతూ..అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం, మిర్చి, పత్తి లోడ్ లారీలు పోవడానికి ఇబ్బందులు ఏర్పటే ప్రమాదం ఉందని వారు వాపోయారు. నిత్యం రద్దీగా ఉండే రహదారి భవిష్యత్తులో మూతపడే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్‌ఫీల్డ్ నిబంధనలకు లోబడి 20 ఫీట్ల ఎత్తుకు పెంచాలని వారు కోరారు. వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్, కరీంనగర్ 1వ వార్డు కార్పొరేటర్ శ్రీనివాస్ సమక్ష్యంలో కేంద్రమంత్రిని కలవడం జరిగిందన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించి, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకవెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు.
కేంద్రమంత్రి బండి సంజయ్‌ను
వేడుకున్న గ్రామస్తులు