
సమావేశంలో మాట్లాడుతున్న కడియం శ్రీహరి, పక్కన అభ్యర్థి కావ్య
హసన్‌పర్తి: అరూరి రమేశ్ చిన్న మెదడు చిట్లిందని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ సన్నాహక సమావేశం హనుమకొండ హంటర్‌రోడ్డులోని డీ–కన్వెన్షన్ హాల్‌లో గురువారం జరిగింది. సమావేశానికి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొంతమంది ఇతర పార్టీ నాయకులు కావ్యను నాన్‌లోకల్ అంటున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చే అవకాశం ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే దేశంలో లౌకికవాదం లేకుండా పోతుందని తెలిపారు. పదేళ్ల కాలంలో బీజేపీ చేసిన అభివృద్ది ఏమీ లేదని, కేవలం దేవుళ్ల పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ పదేళ్ల కాలంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో అరూరి రమేశ్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఓ భూ బకాసురుడని ఆరోపించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎంపీ దయాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నమిండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి