
● ఏఎంఓ సారయ్య
నెక్కొండ: షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఏఎంఓ) సారయ్య సూచించారు. మండలంలోని పెద్దకొర్పోలు కస్తూర్బా గురుకుల విద్యాలయం, స్థానిక హైస్కూల్, గౌతమి విద్యానికేతన్ హైస్కూల్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న పరీక్షలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఏరోజు ప్రశ్నపత్రాలను అదేరోజు తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలను లీక్‌చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 23 వరకు మూల్యాంకనం పూర్తి చేసి విద్యార్థులకు ప్రగతిపత్రాలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అనంతరం స్థానిక ఎమ్మార్సీ భవనాన్ని ఆయన సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఎంఎన్‌ఓ రవికుమార్, హైస్కూల్ హెడ్‌మాస్టర్ రంగారావు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో
నిబంధనలు పాటించాలి
నల్లబెల్లి: ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలని జేడీఏ ఉషాదయాళ్ స్పష్టం చేశా రు. మండలంలోని రేలకుంట, రంగాపూర్, నల్లబెల్లి, మేడపల్లి గ్రామాలను మంగళవారం ఆమె సందర్శించారు. ధాన్యం విక్రయించే సమయంలో పాటించాల్సిన ప్రమాణాలు, భూసార పరీక్షలు, పచ్చిరొట్ట ఎరువు, ఎరువులు,భూయాజమాన్య పద్ధతులపై రైతులకు అ వగాహన కల్పించారు. అనంతరం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ షాపులను తనిఖీ చేశారు. స్టాక్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉషాదయాళ్ మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట జాతీయ ఆ హార భద్రతా మిషన్ కన్సల్టెంట్ సారంగపాణి, వ్యవసాయాధికారి (టెక్నికల్) కృష్ణారెడ్డి, ఏఓ పరమేశ్వర్, ఏఈఓలు, రైతులు ఉన్నారు.
ఓటు హక్కును
సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి
వరంగల్ అర్బన్: భవిష్యత్‌ను నిర్ణయించేది ఓటు మాత్రమే అని జిల్లా స్వీప్ నోడల్ అధికారి పెద్దిరెడ్డి భాగ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని మెప్మా భవన్‌లో మంగళవారం స్వీప్ –2024 అవగాహన సదస్సు నిర్వహించారు. ఆశయం పట్టణ సమాఖ్య సభ్యులకు ఓటు హక్కు ప్రాధాన్యంపై టీపీఆర్వో కోలా రాజేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సులో నోడల్ అధికారి మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు కీలక భూమిక పోషిస్తుందని, ప్రధానంగా యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. ప్రజలు ఓటింగ్‌లో పాల్గొని పోలింగ్ శాతం పెంచేలా పట్టణ సమాఖ్యలు తమ వంతుపాత్ర పోషించాలని సూచించారు. అనంతరం సమాఖ్య సభ్యులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. సదస్సులో టీఎంసీ రమేశ్, సీఓలు నాగరాజు, శ్రీలత, రజిత, రమ, ప్రవీణ్, సఫియా, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సివిల్స్ ర్యాంకర్ కిరణ్‌కు
అభినందనల వెల్లువ
గీసుకొండ: మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ సివిల్స్‌లో 568 ర్యాంకు పొంది ఐపీఎస్ సాధించాడు. దీంతో గ్రామంలో బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. పలువురు అధికారులు, నాయకులు కిరణ్, ఆయన తండ్రి ప్రభాకర్‌కు అభినందనలు తెలిపారు. కిరణ్‌కు గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్ పూల మొక్క అందించి శుభాకాంక్షలు చెప్పారు.

