జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా ‘పొంగులేటి’! | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా ‘పొంగులేటి’!

Dec 25 2023 1:30 AM | Updated on Dec 25 2023 10:29 AM

- - Sakshi

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన శ్రీనివాస్‌రెడ్డి.. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రివర్గ కూర్పు పూర్తయిన కొద్ది రోజులకే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రులను నియమించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌కు ఇన్‌చార్జ్‌ మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు.

ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగామ, వరంగల్‌, హనుమకొండ జిల్లాలకు, సత్యవతిరాథోడ్‌ మహబూబాబాద్‌, ములుగు, జేఎస్‌ భూపాలపల్లి జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా వ్యవహరించారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం మాత్రం ఉమ్మడి జిల్లాకు ఒకే మంత్రిని.. అది ఇతర జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని నియమించింది. గతంలోనూ(రాష్ట్ర విభజనకు ముందు) కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా కొనసాగించింది.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురించి..
రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత కలిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి .. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. పాలేరు ఎమ్మె ల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి 2016లో మృతి చెందారు. అదే సంవత్సరం పొంగులేటి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతితో వచ్చిన ఉపఎన్నికల్లో తుమ్మల నాగేశ్వర్‌రావు బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందాడు.

తుమ్మల గెలుపులో శ్రీనివాస్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అయితే 2019 వరకు పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగిన తనకే తర్వాత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తిరిగి ఖమ్మం ఎంపీ టికెట్‌ ఇస్తారని ఆశించగా.. నామా నాగేశ్వర్‌రావుకు కేటాయించడం పొంగులేటిని అసంతృప్తికి గురిచేసింది. పార్టీ నేతల జోక్యంతో ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీలో ఇమడ లేక పోయారు. ఈ ఏడాది జనవరి 2 నుంచి పార్టీకి అంటీముట్టనట్లుగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి జూలై 2న కాంగ్రెస్‌లో చేరారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖలు నిర్వహిస్తున్న ఆయన ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా నియమితులయ్యారు. కాగా తాజాగా నియామకమైన జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఏసీడీపీ తదితర నిధుల వినియోగం, ఎమ్మెల్యే, ముఖ్యనేతలను సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాల అమలును పర్యవేక్షిస్తారు.

ఇవి కూడా చ‌ద‌వండి: ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా మంత్రి సీతక్క!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement