ఎగువ నుంచి వరద లేక..
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ప్రస్తుతం ఎగువ నుంచి స్వల్పంగా వరద చేరుతుండటంతో రైతుల విజ్ఞప్తి మేరకు ఆయకట్టు పంటలకు అధికారులు చివరి తడిగా సాగునీటిని వదిలారు. పంటలు కోత దశకి వచ్చాయని.. మరో నాలుగైదు రోజుల్లో కోతలు ప్రారంభించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం జూరాల జలాశయంలో 2.175 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జలాశయంలో నీటిమట్టం తగ్గుతుండటంతో తాగునీటి అవసరాలకుగాను ఈ నెల 3న కాల్వలకు నీటి విడుదల నిలిపివేశారు. మరో రెండు తడులు వదిలితే తప్ప తమ పంటలు చేతికందవని ఆయకట్టు రైతులు అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకోవడంతో వదులుతున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని జలాశయంలోని నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని ప్రభుత్వం ప్రకటించడంతో కుడి, ఎడమ కాల్వలకు సాగునీటి విడుదలను అధికారులు నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నారు. వారాబందీ విధానంలో ఇప్పటి వరకు 4 తడులు సాగునీటిని వదిలిన అధికారులు మూడు రోజుల నుంచి 5వ తడిగా విడుదల చేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు, కుడికాల్వ పరిధిలో 30 వేల ఎకరాల పంటలను రైతులు సాగు చేశారు.
‘ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మైను. అమరచింత మండలం
నందిమళ్ల స్వగ్రామం. జూరాల ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టు కింద
7 ఎకరాల్లో వరి సాగుచేశారు. మొదట్లో సాగునీరు అందక పంట
ఎండుతుందని భయపడినా.. అధికారులు, ప్రభుత్వం చొరవతో వారబందీ విధానంలో నీటిని వదలడంతో పంట చేతికొచ్చింది. నీరు సరిపడా అందక అక్కడక్కడ పంట ఎండినా.. పెట్టిన పెట్టుబడి మాత్రం చేతికందే అవకాశం ఉందంటున్నారు.’
జూరాల ప్రధాన ఎడమకాల్వలో నీటి పారుదల
జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల
వారం రోజుల్లో ప్రారంభం కానున్న కోతలు
వారాబందీ విధానంలో ఇప్పటి వరకు 5 తడులు
జలాశయంలో 2.190 టీఎంసీల నీరు
కుడి, ఎడమ కాల్వ పరిధిలో1.15 లక్షల ఎకరాల సాగు


