అమరచింత: అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని.. అర్హులందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో 455 మంది చేయూత లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయంలో ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదని, పేదలకు ఇళ్లు సైతం ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి పేదవాడికి పార్టీలు, కులమతాలు చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. మహిళలు మౌనంగా ఉండకుండా వాస్తవాలను నిర్భయంగా మాట్లాడాలని సూచించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని.. మహిళా సంఘాలు కోరిన వెంటనే రూ.20 లక్షల వరకు రుణాలు మంజూరు చేశారని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వినియోగించాలని, రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కరువు పరిస్థితుల్లోనూ పేదలకు రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా ఆరు కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ చైర్‌పర్సన్ జింక సువర్ణ, వైస్ చైర్‌పర్సన్ రాధ, కాంగ్రెస్‌పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు రాజేందర్‌రెడ్డి, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.


