హామీల అమలులో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

Nov 18 2026 12:32 AM | Updated on Nov 18 2026 12:32 AM

వనపర్తి రూరల్‌: ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్‌లలో ఏ ఒక్కదానిని సరిగా అమలు చేయలేదంటూ అందుకు నిరసనగా కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను చెత్తబుట్టలో పారవేశారు. కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఓటు చోరీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. వాగ్దాన భంగానికి పాల్పడిన నేతలు రాజ్యాంగాన్ని చేతబూని పర్యటించడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్‌గాంధీ నిరుద్యోగులున్న అశోక్‌నగర్‌, ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించాలని డిమాండ్‌ చేశారు. 2 లక్షల ఉద్యోగాల హామీకి కాంగ్రెస్‌ మంగళం పాడిందని మండిపడ్డారు. నాటి కేసీఆర్‌ ప్రభుత్వం మేనిఫెస్టోలో లేకపోయినా రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి పథకాలను అమలుచేసి ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు పొందిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుబంధును మూడుసార్లు ఎగ్గొట్టిందని, సాగునీరు, విద్యుత్‌లేక రైతులు రోడ్లపైకి వచ్చి సబ్‌స్టేషన్లను ముట్టడించే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి ప్రతి నీటి బొట్టును ఎత్తిపోసి పంటలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో కనీసం 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.12 లక్షలు ఖర్చవుతుంటే మంజూరైన లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, తుదివిడత బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. నల్లగొండకు కృష్ణా జలాల పేరుతో రూ.1,800 కోట్ల ప్రతిపాదనతో దోపిడీకి తెర లేపారని ఆరోపించారు. కాంగ్రెస్‌పార్టీ ప్రజల్లో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిందని, సరైన సమయంలో ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు గట్టుయాదవ్‌, వాకిటి శ్రీధర్‌, జగదీశ్వర్‌రెడ్డి, నందిమల్ల అశోక్‌, ఎద్దుల కరుణశ్రీ, కృష్ణానాయక్‌, రఘుపతిరెడ్డి, కురుమూర్తి యాదవ్‌, గంధం పరంజ్యోతి, వేణుగోపాల్‌నాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement