బీమా పథకాలను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బీమా పథకాలను వినియోగించుకోవాలి

Nov 18 2026 12:32 AM | Updated on Nov 18 2026 12:32 AM

కొత్తకోట రూరల్‌: బ్యాంకు ఖాతాదారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బీమా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ డి.శివకుమార్‌ కోరారు. మండలంలోని అమడబాకులకు చెందిన ఆటోడ్రైవర్‌ కావలి రామస్వామి (55) జూన్‌ 12న 44వ నంబర్‌ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన కొత్తకోట యూనియన్‌ బ్యాంకులో పీఎంఎస్‌బీవై చేయించుకోవడంతో మంజూరైన రూ.2 లక్షలను భార్య కావలి అనంతమ్మకు మంగళవారం బ్యాంకు అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఖాతాదారుడు బీమా పథకాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అతి తక్కువ మొత్తంతో బీమా చేయించుకోవడంతో ప్రమాదాలు, అనుకోని మరణాల సమయంలో కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గాయత్రి అనిల్‌యాదవ్‌, గ్రామపెద్దలు సత్యారెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శేషిరెడ్డి, ఉప సర్పంచ్‌ బాలరాజు, బ్యాంక్‌ సిబ్బంది ఉన్నారు.

పాత పింఛన్‌ అమలు చేయాలి

వనపర్తిటౌన్‌: ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాలని, సీపీఎస్‌ రద్దుచేసి పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్‌సీపీఎస్‌ఈయూ జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్రశాఖ పిలుపు మేరకు మంగళవారం జిల్లాలోని సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామూహిక సెలవులు పెట్టి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానం నుంచి కలెక్టరేట్‌ సమీపంలోని ధర్నాచౌక్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్మదీక్ష శిబిరంలో సీపీఎస్‌, ఓపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ ఉద్యోగ సంఘాల జిల్లా నాయకులు కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పాత పింఛన్‌ విధానం అమలుకు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ధర్మదీక్ష శిబిరం నుంచి కలెక్టరేట్‌ వరకు పాదయాత్రగా వెళ్లి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి రాజేంద్రప్రసాద్‌, కోశాధికారి సాయిచందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు మోహన్‌బాబు, రవి, ఈశ్వర్‌, హరీశ్‌, టీఏపీయూఎస్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ప్రధానకార్యదర్శి శశి, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అర్జున్‌నాయక్‌, ఉద్యోగ సంఘాల నాయకులు రాజు, శ్రీనివాస్‌గౌడ్‌, మహేశ్వరాచారి, రామరాజుయాదవ్‌, వెంకటేష్‌, పార్వతి, అరుణ, రాధ, జ్యోతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement