20 ఏళ్లుగా ఎదురుచూపులే..
పెద్దగూడెం లబ్ధిదారులకు స్థలహక్కు పత్రాలు
నాకు 20 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం ప్లాటు మంజూరు చేసినా.. పట్టా కాగితాలు ఇవ్వలేదు. మా ప్లాట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే భయం ఉండేది. తర్వాత వచ్చిన ప్రజాప్రతినిధులు మా సమస్యను పట్టించుకోలేదు. ఇటీవలే ప్రభుత్వం నుంచి పట్టా సర్టిఫికెట్ అందజేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా ప్లాట్ ఎక్కడికి పోదనే భరోసా వచ్చింది. ధ్రువపత్రం అందజేయడానికి కృషి చేసిన నాయకులకు కృతజ్ఞతలు.
– నాయిని యాదమ్మ, పెద్దగూడెం, వనపర్తి
నాకు 20 ఏళ్ల కిందట ప్లాట్ మంజూరు చేయడంతో ఇల్లు నిర్మించుకున్నాను. ఆ ఇల్లు శిథిలావస్థకు చేరడంతో తిరిగి కొత్త ఇంటి నిర్మాణం చేసుకున్నాను. మూడురోజుల కిందట పట్టా ధ్రువపతరం ఇవ్వడంతో ప్లాట్ ఎవరూ తీసుకోరనే నమ్మకం వచ్చింది.
– కై రున్‌బీ, పెద్దగూడెం, వనపర్తి
వనపర్తి: వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని 1997లో నాటి ప్రభుత్వం సూచనప్రాయంగా చేసిన ప్రతిపాదనలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామానికి చెందిన రాంరెడ్డితో భూ సేకరణ చేపట్టి తొలి అడుగువేసింది. 2007లో 12.10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి కొద్దిభాగంలో ప్లాట్లువేసి పట్టాలిచ్చారు. వారికి అప్పుడే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా.. నిర్మాణం చేసుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మరో 145 కుటుంబాలు అర్జీ చేసుకోగా.. పరిస్థితుల ప్రభావం, కొన్ని అడ్డంకులతో ఏళ్లుగా నిరీక్షణ చేయాల్సి వచ్చింది. శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు తన గ్రామంలోని సమస్యను తెలుసుకొని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో సమన్వయం చేసుకొని సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల ఏడున దశాబ్దాలుగా స్థల హక్కుపత్రాల కోసం ఎదురుచూస్తున్న వారికి అఽధికారికంగా పంపిణీ చేశారు. రెండు దశాబ్దాలుగా ఎదురుచూసిన లబ్ధిదారుల కల సాకారమైనట్లయింది.
వైఎస్సార్ హయాంలో
సొంతింటి కలకు పునాది
రెండు దశాబ్దాల తర్వాత చట్టబద్ధత
ఇటీవల డీసీసీ అధ్యక్షుడి సొంత గ్రామంలో పట్టాల పంపిణీ
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు సొంతింటి స్థలం ఇవ్వాలనే లక్ష్యంతో ప్లాట్ల కేటాయింపు చేపట్టారు. దీంతో అప్పట్లో ఎంతోమంది నిరుపేదలు తమకు సొంతంగా ఇంటి స్థలం వచ్చిందని సంతోషించారు. అయితే కాలక్రమంలో ఆయా ప్లాట్లకు పూర్తిస్థాయిలో చట్టబద్ధమైన హక్కులు లభించకపోవడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థలం ఉన్నప్పటికీ హక్కుపత్రాలు లేకపోవడంతో వాటిపై పూర్తి భరోసా లేకుండా పోయింది. ఈ క్రమంలో సుమారు 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్లాట్లకు చట్టబద్ధత కల్పించి హక్కుపత్రాలు అందజేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


