రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

Nov 12 2026 5:24 AM | Updated on Nov 12 2026 5:24 AM

కొత్తకోట రూరల్‌: రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ గార్డెన్స్‌లో కొత్తకోట, పామాపురం పీఏసీఎస్‌ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల పంట రుణమాఫీ అమలు చేసి లక్షలాది రైతు కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కల్పించిందన్నారు. సాగు ఖర్చులను తగ్గించేందుకు రాయితీపై వ్యవసాయ సామగ్రి అందించడంతో పాటు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా అవసరమైన యంత్రాలు, పరికరాలు, విత్తనాలను అందిస్తూ రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రభుత్వం అన్నదాతల అభ్యున్నతికి చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి రైతుకు వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు సహకార సంఘాల నాయకులపై ఉందన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి నమ్మకంతో పనిచేసిన నాయకులను గుర్తించి చైర్మన్లు, డైరెక్టర్లుగా బాధ్యతలు అప్పగించామని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, పదవులు లభిస్తాయన్నారు. బాధ్యతలు చేపట్టిన పీఏసీఎస్‌ చైర్మన్లు, డైరెక్టర్లు పదవులను హోదాలుగా కాకుండా రైతులకు సేవచేసే అవకాశంగా భావించాలని సూచించారు. రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించాలని, ప్రభుత్వం అందించే రాయితీలు, సంక్షేమ పథకాలు అర్హులైన రైతులందరికీ అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కొత్తకోట పీఏసీఎస్‌ చైర్మన్‌గా రావుల జితేంద్రనాథ్‌రెడ్డి, పామాపురం చైర్మన్‌గా నాగారపు బీచుపల్లియాదవ్‌, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్‌ అరుణ, వైస్‌ చైర్‌పర్సన్‌ పి.పల్లవి, నాయకులు పి.ప్రశాంత్‌, పి.కృష్ణారెడ్డి, ఎన్‌జే బోయేజ్‌, శేఖర్‌రెడ్డి, డా. పీజే బాబు, పెంటన్నయాదవ్‌, సలీంఖాన్‌, ముజీబ్‌, మాసన్న, ముస్తఫా, మండ్ల రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement