అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట

Sep 5 2026 12:50 AM | Updated on Sep 5 2026 12:50 AM

కోస్గి/కోస్గి రూరల్‌: అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తూ జాప్యం చేయకుండా వేగవంతంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. నిర్దేశిత నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై కఠినచర్యలు తీసుకోవాలని చెప్పారు. శుక్రవారం సీఎం తన సొంత నియోజకవర్గంలో పర్యటించి.. అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా మద్దూరుకు మధ్యాహ్నం 2.53 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రికి కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక పట్టణ శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో దోరెపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్ద పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో బయలుదేరిన సీఎం ముందుగా రూ.6.10 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ నమూనా చిత్రపటాన్ని పరిశీలించడంతోపాటు భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం, నిర్మాణ విస్తీర్ణం, తరగతి గదులు, ప్రయోగశాలల వివరాలతోపాటు 4 ఎకరాల స్థలంలో 13,670 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్థుల భవనం నిర్మిస్తున్నట్లు ఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతిరెడ్డి సీఎంకు వివరించారు. కళాశాల భవనం పక్కన ప్రధాన రహదారి వైపు ఉన్న అదనపు భూమిని సర్వే చేయించాలని, అది పట్టా భూమి అయితే కొనుగోలు చేసి కళాశాలకు విశాలమైన ప్రాంగణం, ప్రహరీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రియాంకకు సూచించారు. రానున్న మార్చిలోగా కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తిచేసి.. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి చింతల్‌దిండి రోడ్డులో రూ.30 కోట్ల నిధులతో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. గురుకుల పాఠశాల, కళాశాలలకు స్థలం ఇచ్చిన దాతలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి మద్దూరు పర్యటన సందర్భంగా పట్టణంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సెక్రెటరీ శ్రీధర్‌, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్రీను, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ రాజేశ్వరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, మద్దూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సరస్వతి, వైస్‌ చైర్‌పర్సన్‌ భాగ్యశ్రీ, కోస్గి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీములు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు నర్సింహులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బాలయ్య, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

పర్యటన సాగింది ఇలా..

2.53 గంటలకు మద్దూరు మున్సిపల్‌ శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ దగ్గర సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వచ్చారు.

2.56 గంటలకు పేట కలెక్టర్‌ ప్రియాంక ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

3.00 గంటలకు సీఎం కాన్వాయ్‌లో డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం సీఎం భవన నిర్మాణ పనులను పరీశీలించారు.

3.25 గంటలకు స్థానిక పాత బస్టాండ్‌ ఆంజనేయస్వామి ఆలయం మీదుగా సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలకు చేరుకున్నారు. అక్కడ సమీప కాలనీలోని మహిళలతో మాట్లాడారు.

3.45 గంటలకు గురుకుల కళాశాల నుంచి బయలుదేరి.. నారాయణపేట– కోస్గి ప్రధాన రహదారిపై ఇరువైపులా నిల్చున్న ప్రజలకు కారు డోర్‌లో నిలబడి అభివాదం చేస్తూ హెలీప్యాడ్‌కు చేరుకున్నారు.

4.00 గంటలకు సీఎం, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కడా చైర్మన్‌ వెంకట్‌రెడ్డి హెలిక్యాప్టర్‌లో కూర్చున్నారు.

4.08 గంటలకు వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని గోకఫసల్‌బాద్‌కు హెలిక్యాప్టర్‌ బయలుదేరి వెళ్లింది.

నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు

డిగ్రీ కళాశాల భవనాన్ని

మార్చిలోగా పూర్తిచేయాలి

మద్దూరులో అభివృద్ధి పనులు పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి

సొంత నియోజకవర్గంలో 1.15 గంటలు

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement