మదనాపురం/కొత్తకోట రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆ పార్టీ శ్రేణులు మదనాపురం, కొత్తకోట మండలాల్లో భారీ బైక్ ర్యాలీ, సంబరాలు నిర్వహించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మొదట మదనాపురం మండలంలోని దుప్పల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ బైక్ ర్యాలీతో కొత్తపల్లి, మదనాపురం, దంతనూరు మీదుగా కొత్తకోటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రజలను మోసం చేయడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని.. మదనాపురం–ఆత్మకూరు మార్గంలో రూ.6 కోట్లతో వంతెన పనులు పూర్తి చేశామని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. శంకరంపేట, దంతనూర్ ప్రాంతాల ప్రజల రాకపోకల సౌకర్యార్థం మరో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ మదనాపురం మండలంలోని మూడు ఎత్తిపోతల పథకాల మరమ్మతుకు రూ.5 కోట్లు కేటాయించామన్నారు.


