విద్యార్థుల సంఖ్య పెంపునకు.. | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సంఖ్య పెంపునకు..

Sep 5 2026 12:50 AM | Updated on Sep 5 2026 12:50 AM

వనపర్తిటౌన్‌: పెబ్బేరు చెంచువాడ ఎంపీపీఎస్‌ ఉపాధ్యాయుడు దాసరి చిన్న రాములు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 2024, జూలై 1న బదిలీపై పాఠశాలకు వచ్చిన ఆయన విద్యార్థుల సంఖ్య పెంపునకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న విద్యను తల్లిదండ్రులకు వివరిస్తూ చేర్పించేలా ప్రోత్సహించారు. ఫలితంగా ప్రారంభంలో 40 ఉన్న విద్యార్థుల సంఖ్యను 2025–26లో 96కు, 2026–27లో 136కు చేరింది. ఆయన పాఠశాలకు వచ్చిన సమయంలో దట్టమైన ముళ్లపొదలు, మట్టి దిబ్బలతో ఉన్న ఆవరణను స్థానిక నాయకులు, దాతల సహకారంతో శుభ్రం చేసి చదును చేయించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో తరగతి గదుల కొరత ఏర్పడగా.. రేకుల షెడ్డు ఏర్పాటుకు రూ.50 వేలు సొంతంగా ఖర్చు చేశారు. మిగతా పనులను దాతలను ఒప్పించి వారి సహకారంతో పూర్తి చేయించారు. సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక బోధన అందిస్తున్నారు. సొంత ఖర్చుతో టీచింగ్‌, లర్నింగ్‌ కిట్స్‌ సమకూర్చి పాఠాలను సులభంగా, ఆసక్తికరంగా బోధిస్తున్నారు. చదువుతో పాటు ఆటలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల్లోని ప్రతిభను వెలికితీస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తుండగా.. చిన్న రాములు ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

● చిన్న రాములు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. బీఏ, బీఈడీ పూర్తి చేసి 2010లో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఆయనను తల్లి టీ కొట్టు నిర్వహిస్తూ చదివించారు. తాను ఎదుర్కొన్న కష్టాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. పాఠశాలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచి.. విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచిన ఆయన కృషికి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement