మహిళలు, చిన్నారుల భద్రత అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

మహిళలు, చిన్నారుల భద్రత అందరి బాధ్యత

Aug 7 2026 4:05 AM | Updated on Aug 7 2026 4:05 AM

వనపర్తి: మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని.. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజంలోని అన్నివర్గాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి సుధారాణి పిలుపునిచ్చారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమెతో పాటు జెడ్పీ సీఈఓ యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మానవ అక్రమ రవాణాతో మహిళలు, బాలికలు, చిన్నారులు ఎదుర్కొనే ప్రమాదాలు, రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఉద్యోగాలు, విదేశీ ఉపాధి, విద్య పేరుతో తప్పుడు హామీలిచ్చి మోసం చేయడం, సోషల్‌ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకొని వల వేయడం, నకిలీ వివాహలు, చిన్నారులను ప్రలోభపెట్టడం లేదా అపహరించడం వంటి మార్గాల ద్వారా అక్రమ రవాణా జరుగుతోందన్నారు. ఇలాంటి ముఠాల బారిన పడితే వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోవడం, శారీరక–మానసిక హింసకు గురికావడం, చదువు, భవిష్యత్‌ దెబ్బతినడం, కుటుంబాలకు దూరమవడం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనలో ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అధికారులు పేర్కొన్నారు. అనంతరం అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుబడి పని చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్‌రెడ్డి, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ఎస్‌ఐ అంజాద్‌, ఆర్డీఎస్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement