వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని రాజపేట శివారు వైటీసీ భవనంలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నియోజకవర్గం విద్య, క్రీడలపరంగా రాష్ట్రస్థాయిలోనే గుర్తింపు సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రీయ విద్యాలయ మంజూరు చేసిన ప్రధాని మోదీకి, కేంద్ర విద్యాశాఖ మంత్రికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఎంపీ మల్లు రవికి, కలెక్టర్ ఆదర్శ్ సురభికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించండి
ఆత్మకూర్: పుర ప్రజలు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని పుర కమిషనర్ చికినె శశిధర్ కోరారు. మంగళవారం వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, సిబ్బందితో కలిసి పట్టణంలో పర్యటించి మొండి బకాయిలు ఉన్న దుకాణాలకు తాళం వేసి సీజ్ చేశారు. ఏప్రిల్ 30లోగా పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ ఇస్తున్నామని.. తర్వాత రెండు శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. గడువులోగా వందశాతం పన్ను వసూలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
పౌర్ణమి ప్రత్యేక పూజలు
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి శివారులో ఉన్న దత్తకోటిలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవాం ఉదయం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కోటిలింగేశ్వరస్వామి వారికి, పంచలోహ శివలింగానికి ఆవుపాలతో అభిషేకం, పుష్పార్చన చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మహా మంగళహారతి ఇచ్చినట్లు వివరించారు. అనంతరం చంద్ర గ్రహణం కారణంగా ఆలయం మూసివేశారు. బుధవారం ఉదయం 6 నుంచి భక్తులను అనుమతిస్తామని చెప్పారు.
పర్యాటకాభివృద్ధికి కృషి
కొల్లాపూర్ రూరల్: మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు జిల్లా టూరిజంశాఖ అధికారి నర్సింహ అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌లో కలెక్టర్ బదావత్ సంతోష్‌ను ఆయన కలిసి పర్యాటకశాఖ డైరీ, క్యాలెండర్ అందజేశారు. అనంతరం సోమశిల, సింగోటం, జటప్రోలు, కొల్లాపూర్ కోట తదితర ప్రాంతాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేసే ప్రణాళికలపై కలెక్టర్‌తో చర్చించారు. త్వరలో జిల్లా ఫారెస్టు, రెవెన్యూ, దేవాదాయ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమావేశమై.. సోమశిల–అలంపూర్ టూరిజం సర్క్యూట్‌పై సమీక్షించనున్నట్లు కలెక్టర్ తెలియజేశారని ఆయన తెలిపారు.


