ఆశయాలు.. ఆకాంక్షలు నెరవేరాలి
ఉన్నత చదువులతోనే అత్యున్నత శిఖరాలకు..
‘కాలచక్రంలో మరో ఏడాది గడిచిపోయింది. నిర్దేశించుకున్న ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని 2025కు గుడ్‌బై చెబుతూ.. 2026కు స్వాగతం పలికేందుకు అన్నివర్గాల వారు సిద్ధమయ్యారు. కొత్త సంవత్సరంలో విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు తెలుసుకొనేందుకు బుధవారం జిల్లాలోని పెద్దగూడెం శివారు మహాత్మా జ్యోతిబా పూలే వ్యవసాయ డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో చర్చాగోష్టి నిర్వహించారు. మరికొన్ని నెలల్లో పీజీలోకి అడుగుపెట్టే విద్యార్థుల భవిష్యత్ ప్రణాళిక, సాగులో మార్పులు.. అందుకు ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యక్రమాలు, సమాజం.. ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని సేంద్రియ సాగు ప్రోత్సాహం, పద్ధతులపై వారితో చర్చించగా.. తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2026 సంవత్సరంలో అందరూ బాగుండాలి.. విద్య, ఉద్యోగ అవకాశాలు ఆశించిన మేర లభించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రశాంతితో కలిసి విద్యార్థులు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. – వనపర్తి/వనపర్తి రూరల్
నేను అగ్రికల్చర్ బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నా. మా అధ్యాపకుల సూచనల మేరకు ఎమ్మెస్సీ ఎంటమాలజీ, పీహెచ్‌డీ చేయాలని ఉంది. లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడి చదువుతూ నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నా. లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నా.
– పద్మజ, విద్యార్థిని, మహబూబ్‌నగర్
నేను వనపర్తి ఎంజేపీ బాలికల అగ్రికల్చర్ కళాశాలలో బీఎసీ (అగ్రికల్చర్) చివరి సంవత్సరం చదువుతున్నా. తర్వాత ఎంబీఏ (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) చదవాలని ఉంది. సొంత కాళ్లపై నిలబడి జీవించాలనే లక్ష్యం నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు సాగేందుకు ప్రణాళిక రూపొందించుకున్నా.
– నవ్యశ్రీ, విద్యార్థిని, నారాయణపేట
గడిచిన ఏడాది మధుర స్మృతులను గుర్తు చేసుకొని, కొత్త సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలను నోట్ పుస్తకంలో రాసుకున్నా. మంచిగా చదివి ఉత్తమ మార్కులు సాధించి ఎమ్మెస్సీ ఎంటమాలజి చేయాలని ఉంది. ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్‌పై పరిశోధనలు చేసి రైతులకు ఉపయోగపడే ఎరువులు, విత్తనాలు అందించాలనేదే లక్ష్యం.
– లావణ్య, విద్యార్థిని, వికారాబాద్
అగ్రికల్చర్ బీఎస్సీలో ఉత్తమ మార్కులు సాధించి ఎమ్మెస్సీ (ఆర్గానిక్ అగ్రికల్చర్) చదవాలని ఉంది. ప్రజలకు కల్తీలేని ఆహారం అందించేందుకు సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తా. అలాగే ఆర్గానిక్ ఫర్టిలైజర్‌పై రైతులకు కల్తీలేని ఎరువులు అందించేందుకు కృషి చేస్తా. ఇందుకోసం 2026 సంవత్సరంలో ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతా.
– అలేఖ్య, నిజామాబాద్
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది నా లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో నిరంతరం చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ప్రస్తుత వార్షిక పరీక్షల్లోనూ ఉత్తమ మార్కులు సాధించేందుకు కష్టపడి చదువుతున్నా. ఐపీఎస్ కావాలన్నది నా లక్ష్యం.
– ఉషాశ్రీ, జనగామ
ఎంబీఏ (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) చదివి స్వశక్తితో జీవించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నా. మంచి వ్యాపారం ప్రారంభించి చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉంది. వ్యాపారరంగంలో నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనే కోరిక ఉంది.
– శివాని, విద్యార్థిని, నల్గొండ
జిల్లాకేంద్రంలోని
మహాత్మా
జ్యోతిబా పూలే
వ్యవసాయ డిగ్రీ
కళాశాలలో
‘సాక్షి’ చర్చాగోష్టి
కొత్త సంవత్సరంలో
తమ ఆశయాలు,
అభిప్రాయాలు
పంచుకున్న
పలువురు
విద్యార్థులు


