మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మదనాపురం: కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలుస్తూ వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మండలంలోని సరళాసాగర్ జలాశయంలో ఉచిత చేప పిల్లలను సంఘం నాయకులు, పార్టీ నేతలతో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. ప్రతి పేదోడి ముఖంలో చిరునవ్వు చూడాలనేదే ఆయన ఆశయమని.. కులవృత్తులపై ఆధారపడిన వారికి భరోసా కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా వందశాతం సబ్సిడీతో నాణ్యమైన చేప పిల్లలను అందిస్తున్నారని వివరించారు. చేపల విక్రయాల కోసం సంచార విక్రయ కేంద్రాలు, ఆధునిక మార్కెట్లను ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు చెప్పారు. సరళాసాగర్ జలాశయంపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాసరావు, నాగరాజుగౌడ్, మత్స్యశాఖ ఏడీ లక్ష్మయ్య, మార్కెట్ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, మండల కో–ఆర్డినేటర్ చుక్క మహేష్, మార్కెట్ డైరెక్టర్ పావని, నాయకులు రాజవర్ధన్‌రెడ్డి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు రంగన్న తదితరులు పాల్గొన్నారు.


