
వర్షాలకు ప్రాణనష్టం జరగొద్దు
కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు..
● అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి: జిల్లాలో రానున్న మూడురోజులు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి జిల్లా, మండల అధికారులు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. జిల్లా ఇప్పటి వరకు ఎల్లో జోన్‌లో ఉండగా.. ప్రస్తుతం రెడ్ జోన్‌లోకి మారినట్లు వాతావరణశాఖ హెచ్చరించిందన్నారు. వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు పకడ్బందీగా చేపట్టాలని.. అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆయా మండలాల్లో ఉన్న లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాలు, నది పరీవాహక ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, పునరావాస కేంద్రాలను గుర్తించి నివేదికను గురువారం కలెక్టరేట్‌కు అందజేయాలని ఆదేశించారు. విపత్కర పరిస్థితిలో బాధ్యతల నుంచి ఏ ఒక్క అధికారి తప్పించుకోవడానికి వీలులేదని.. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మూడు రోజుల వరకు ఎలాంటి సెలవులు లేవని.. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, విద్యుత్ అధికారులు, స్టేషన్ హౌజ్ అధికారులు తమ కేంద్రాల్లో ఉంటూ పరిస్థితులను గమనించాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి అందులో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు, పశువుల కాపరులు మేపునకు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. విద్యుత్ సిబ్బంది వాహనాలతో సిద్ధంగా ఉండాలని, ఎక్కడైనా స్తంభాలు విరగడం, తీగలు తెగటం వంటి సమస్యలు తలెత్తితే సరఫరా నిలిపివేసి ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేయాలన్నారు.
పోలీసు సిబ్బందికి ఆదేశాలిచ్చాం..
రానున్న మూడురోజులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీసు సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చామని ఎస్పీ రావుల గిరిధర్ వివరించారు. సరళాసాగర్ జలాశయం సైఫన్లు తెరుచుకుని నీరు పారుతుందని.. పోలీస్, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలు రోడ్డు దాటకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నది పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలని, ప్రజలు ప్రవహిస్తున్న వాగులు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు ఎన్.కీమ్యానాయక్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
వర్షాల విపత్తును ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఏదైనా విపత్కర పరిస్థితి తలెత్తితే వెంటనే 08545-220351/233525 కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని.. రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల, విద్యుత్‌శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు.