
మత్తు రహిత సమాజాన్ని నిర్మిద్దాం
వనపర్తి: మత్తు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలని, భావితరాలకు ఉజ్వల భవిష్యత్ అందిద్దామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్–2025లో భాగంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన అధికారులు, సిబ్బందితో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్‌ఎంబీఏ) అమలు చేస్తోందన్నారు. అవగాహన ప్రచారం 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిధిలో మాదకద్రవ్య వినియోగానికి వ్యతిరేకంగా పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు, ప్రజలను భాగస్వామ్యాన్ని చేయాలనే ముఖ్య ఉద్దేశంతో సామూహిక ప్రతిజ్ఞ నిర్వహించినట్లు చెప్పారు. జిల్లా పరిధిలో గంజాయి రవాణా చేసినా, సాగుచేసినా చట్టపరమైన చర్యలు తప్పవని.. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కేసులు నమోదు చేసి, పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయం ఏఓ సునందన, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ రామేశ్వర్‌రెడ్డి, కార్యాలయ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.