రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారం..
వనపర్తి రూరల్: రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మండలంలోని అంకూర్‌లో బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి దరఖాస్తు ఫారాలు ఒకరోజు ముందుగానే అందించారా, గ్రామంలో టాంటాం వేయించారా లేదా అని ఆరా తీశారు. దరఖాస్తులను పరిశీలించి సాధ్యమైన వాటిని అక్కడే పరిష్కరించాలని తహసీల్దార్ రమేశ్‌రెడ్డిని ఆదేశించారు. నోటీసులు ఇవ్వాల్సిన వాటికి వెంటనే జారీ చేసి గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, ఆర్‌ఐ మధు తదితరులు ఉన్నారు.


