దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికిగాను ప్రవేశాల కోసం ఈ నెల 17 నుంచి 31 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి గురువారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో http://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశం 2025, మార్చిలో 10వ తరగతి ఉత్తీర్ణులై సీజీపీఏ 7.0 లేదా 400 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలలు, రెసిడెన్షియల్, ఎయిడెడ్, నవోదయ, కస్తూర్బా, బెస్ట్ అవైలబుల్, తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదివిన విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందఇ తెలిపారు. ఎంపిక జాబితా జూన్ 5న, ధ్రువపత్రాల పరిశీలన, కళాశాల కేటాయింపు, ఆర్డర్ పొందుట జూన్ 10న జరుగుతుందన్నారు.
ఏకలవ్య మోడల్ కళాశాలల్లో..
తెలంగాణ గిరిజన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాల బాలానగర్, కల్వకుర్తిలో 2025–26 విద్యాసంవత్సరం ప్రవేశాలకుగాను ఎంపీసీలో 14, బైపీసీలో 48, సీఈసీలో 33 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రూపుల్లో (సీబీఎస్‌ఈ సిలబస్) ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లకుగాను 10వ తరగతి పూర్తి చేసిన గిరిజన బాలుర విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుకు ధ్రువపత్రాలు జతచేసి 24వ తేదీ సాయంత్రం 4 వరకు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌కు అందజేయాలని సూచించారు. 26వ తేదీ ఉదయం 10 గంటలకు బాలానగర్ కళాశాలలో కౌన్సిలింగ్ ఉంటుందన్నారు.
సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
వనపర్తిటౌన్: కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఈ నెల 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాలకు వనపర్తి డిపో నుంచి డీలక్స్, సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రానుపోను సూపర్ లగ్జరీ బస్సుకు రూ.2,320, డీలక్స్‌కు రూ.2,040 టికెట్ ధర నిర్ణయించామని.. ఆసక్తి గల భక్తులు, ప్రయాణికులు టికెట్‌ను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
కాంటాలను విధిగా పునరుద్ధరించుకోవాలి
ఖిల్లాఘనపురం: జిల్లాలోని ధర్మకాంటాలను సకాలంలో తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలని తూనికలు, కొలతల జిల్లా అధికారి సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని రైస్‌మిల్లుల దగ్గర ఉన్న ధర్మకాంటాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల వరి ధాన్యం తూకం చేయించుకున్న రైతులు తూకాల్లో తేడాలను గుర్తించి ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. మూడు కాంటాల్లో వెయ్యి కిలోలకు 10 కిలోల నుంచి 50 కిలోల వరకు ఎక్కువ రావడం జరిగిందన్నారు. దీంతో రైతులకు ఎలాంటి నష్టం జరగలేదని.. టెక్నీషియన్లు అన్ని కాంటాలను సరిచేసినట్లు వివరించారు.
సోళీపురంలో సీజ్..
మండలంలోని సోళీపురం గ్రామ ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ రైస్‌మిల్లు దగ్గర ఉన్న ధర్మ కాంటను సీజ్ చేసి కేసునమోదు చేసినట్లు జిల్లా తూనికలు, కొలతల అధికారి సత్యనారాయణ తెలిపారు. రైస్‌మిల్లు బయట ఉన్న కాంటను ఎలాంటి అనుమతి లేకుండా లోపలికి మార్చారని.. అదేవిధంగా కాంటా దగ్గర బాట్లు లేకపోవడం, గడువు ముగిసినా పునరుద్ధరించుకోకపోవడంతో సీజ్ చేసినట్లు చెప్పారు.


