సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి
వనపర్తి/వనపర్తి రూరల్: రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ భావితరాలకు సారవంతమైన భూమిని అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం నాగవరం రైతువేదికలో జరిగిన రైతునేస్తం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భూమిలో సారం తగ్గిందని ఏటా డీఏపీ, యూరియా తదితర రసాయన ఎరువులు అధికంగా వినియోగిస్తే అనతి కాలంలోనే భూమి సత్తువ కోల్పోయి చౌడు నేలగా మారుతుందన్నారు. భవిష్యత్ తరాలకు సైతం భూమి ఉపయోగపడి పంటలు పండాలంటే సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరారు. పంట వేసే 45 రోజుల ముందు జీలుగ, పచ్చ రొట్ట, పెసర, జనుము వంటి పంటలు సాగు చేసి పూత దశలో ట్రాక్టర్‌తో తొక్కించడంతో సేంద్రియ ఎరువుగా మారుతుందని తెలిపారు. దీంతోపాటు పశువుల ఎరువు వాడటంతో అధిక దిగుబడి రావటమే కాకుండా భూమి సారవంతంగా మారుతుందన్నారు. జిల్లాకు జీలుగ విత్తనాలు 1,010 క్వింటాళ్లు సరఫరా అయ్యాయని, మరో రెండు వేల క్వింటాళ్ల విత్తనాలు పంపించాల్సిందిగా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. ప్రతి మంగళవారం రైతువేదికల్లో నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారని.. రైతులు సద్వినియోగం చేసుకొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. భారత్‌లో ఆయిల్‌పాంకు చాలా డిమాండ్ ఉందని, సాగు వైపు ఆలోచించాలని కోరారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్ మాట్లాడుతూ.. జీలుగ, పచ్చ రొట్ట విత్తనాలు పీఏసీఎస్ కేంద్రాల్లో విక్రయిస్తున్నారని, పొలాల్లో పండించి పూత దశలో రోటోవేటర్‌తో దున్నటంతో మట్టిలో కలిసి నేల సారవంతంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్‌రెడ్డి, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.


