రేపటి ప్రజావాణి రద్దు
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 17 నుంచి 26 వరకు జిల్లా అధికారులు భూ భారతి–2025 చట్టంపై మండలాల్లో రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీంతో సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్‌కు ఎవరూ రావద్దని కోరారు.
నర్సింగ్‌హోం సీజ్
ఆత్మకూర్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో స్థాయికి మించిన వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం పట్టణంలోని శ్రీసాయినర్సింగ్‌హోంను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అమరచింత మండలం చంద్రగఢ్‌కు చెందిన గర్భిణి ప్రసవానికి వస్తే అనెస్తేషియా వైద్యుడు లేకుండానే శస్త్రచికిత్స చేసినట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిర్ధారించినట్లు వివరించారు. దీంతో తల్లి క్షేమంగా ఉన్నప్పటికీ శిశువు మృతిచెందిందని, కలెక్టర్ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేసి నర్సింగ్‌హోంను సీజ్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనున్నట్లు వెల్లడించారు.
పీయూలో కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. ఈ మేరకు పీయూ ప్రధాన గేట్ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సంఘం నాయకులు భూమయ్య, శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. నెట్, సెట్, పీహెచ్‌డీ వంటి అర్హతలు ఉన్న అధ్యాపకులను ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రెగ్యులరైజ్ చేయాలని, జీఓ నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మెకు నాన్ టీచింగ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్, బుర్రన్న సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో రవికుమార్, సుదర్శన్‌రెడ్డి, విజయభాస్కర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఈశ్వర్‌కుమార్, ప్రదీప్ కుమార్, సురేశ్, మొయినుద్దీన్ పాల్గొన్నారు.
రేపటి ప్రజావాణి రద్దు


