జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

విజయనగరం లీగల్‌: డిసెంబర్‌ 12న జరగబోయే జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. జాతీయ లోక్‌ అదాలత్‌ గురించి కక్ష దారులకు అవగాహన కల్పిస్తూ అధిక సంఖ్యలో పెండింగ్‌ లో ఉన్న రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ, జిల్లా న్యాయ అధికార సంస్థ కృష్ణప్రసాద్‌, ప్యానల్‌ న్యాయవాదులు, పారాలీగల్‌ వలంటీర్లు,అంగన్వాడీ వర్కర్సు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు కొండలక్ష్మీపురం విద్యార్థులు

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): గరివిడి మండలంలోని కొండలక్ష్మీపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు.ఇటీవల స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో అండర్‌–17 విభాగంలో చింతపల్లి లోకేష్‌, మీసాల మోనిషాలు అండర్‌–17 విభాగంలో పెద్దింటి మిధున్‌, వట్టికాల సాత్విక్‌, గేదెల కోమలి, కొలుసు పుణ్యవతిలు ప్రతిభ చాటారు. వారంతా అనకాపల్లిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించి తమ సత్తా చాటనున్నారు. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై న విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు ఒమ్మి సురేష్‌బాబు, పీడీ శ్రీకాంత్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ కాగాన గౌతమి, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

హెచ్‌ఐవి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ

భాగస్వామ్యం కావాలి

● జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డాక్టర్‌ రాణి

విజయనగరం ఫోర్ట్‌: హెచ్‌ఐవీ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డాక్టర్‌ కె. రాణి అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ హెచ్‌ఐవీ రోగులు అందరూ మందులు వాడేలా చేయాలన్నారు. వారి జీవితకాలం పెంచేవిధంగా వారికి చికిత్స అందించాలని స్పష్టం చేశారు. హెచ్‌ఐవి పరీక్షలు, చికిత్స, ఫాలోఅప్‌ చేయడంలో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందన్నారు.ఇందుకుగాను సురక్షిత్‌ అవార్డు జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణశాఖ వచ్చిందని చెప్పారు. సిబ్బంది కృషి వల్లే మూడో స్థానం సాధించగలిగామని తెలిపారు. మొదటి స్థానం సాధించేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో బద్రి, ఉమమహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

10 నుంచి అగ్రిగోల్డ్‌

డిపాజిట్‌దారులకు వెరిఫికేషన్‌

విజయనగరం టౌన్‌: నెల్లిమర్ల మండలంలోని అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారుల నుంచి బాండ్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ ఈ నెల 10న చేపడుతున్నట్లు సీఐడీ డీఎస్పీ వి.చంద్రశేఖర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెరిఫికేషన్‌ ప్రక్రియ కంటోన్మెంట్‌ పోలీసు క్వార్టర్స్‌లోని దండుమారమ్మ ఆలయం సమీపంలో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ బ్యారెక్స్‌ వద్ద చేపడుతున్నామని, కేటాయించిన ఆయా గ్రామాలకు చెందిన డిపాజిట్‌ దారులు రావాలని కోరారు. బాండ్‌ కలర్‌ జిరాక్స్‌, ఆధార్‌, పాన్‌ కార్డ్‌, బ్యాంక్‌ పాస్‌ బుక్‌ ఫ్రంట్‌ పేజీ, ఒక కలర్‌ ఫొటోతో సహా ఒరిజినల్‌ బాండ్‌ను తమ వెంట తీసుకురావాలన్నారు. బాండ్‌ పరిశీలన తర్వాత ఒరిజినల్‌ బాండ్‌ తిరిగి అందజేస్తామని ప్రజలు సహకరించాలని కోరారు.

● 10వ తేదీన ఏటీ అగ్రహారం, అలుగోలు, బొప్పడాం, బూరాడపేట. ● 11న చంద్రంపేట, దన్నానపేట, గరికపేట, గొర్లిపేట ● 12న గుషిణి, జోగిరాజుపేట, కొండగుంపాం, కొండవెలగాడ, కొత్తపేట, మధుపాడ ● 13న మల్యాడ, మొయిద, పారసాం, పెదబూరాడపేట, పూతికపేట ● 16న రామతీర్థం, సారిపల్లి, సతివాడ, సీతారామునిపేట ● 17న తంగుడుబిల్లి, టెక్కలి, తమ్మాపురం, వల్లూరు, ఒమ్మి గ్రామాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement