● గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగనున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి
పార్వతీపురం: పట్టణ స్థానిక సంస్థల పరిధిలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నవంబర్ 7వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఎత్తివేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పురపాలక, నగర పంచాయతీల పరిధిలో ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన పూర్తయిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ను ఉప సంహరించినట్లు వివరించారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తైనప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇంకా ముగియనందున గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
రైతు బజారుల్లో కిలో ఉల్లి రూ.35కే
బయట మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలు కిలో రూ.50 నుంచి రూ.60లు వరకు పలుకుతుండగా, పార్వతీపురం రైతు బజారులో కిలో రూ.35కే సబ్సిడీపై విక్రయిస్తున్నట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ విక్రయాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ ధరలతో పోలిస్తే తక్కువ ధరకే ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నందున ప్రజలు రైతు బజారును సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జనగణన గడువులోగా పూర్తి చేయాలి
సెన్సెస్ –2027 రెండవ దశ జనాభా గణన ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జనగణన–2027 శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెల్ఫ్ ఎన్యూమరేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సమష్టి కృషితో సెల్ఫ్ ఎన్యూమరేషన్‌ను 50శాతానికి పైగా పూర్తి చేయాలని సూచించారు. నవంబర్ 10 నుంచి 19 వరకు ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ, 20 నాటికి ఎన్యూమరేషన్ బ్లాక్‌ల సిద్ధం, 21 నాటికి సూపర్‌వైజరీ సర్కిళ్ల ఏర్పాటు, 23 నాటికి ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో ఎదురైన లోపాలు పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళికతో జనగణన నిర్వహించాలని పేర్కొన్నారు. జనగణన విధుల్లో నిర్లక్ష్యం లేకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ సచిన్ ఆర్చిత్ రహార్, డీఆర్‌ఓ కె.హేమలత ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


