పాత గొడవల్లో ఉపాధ్యాయుడి మృతి | - | Sakshi
Sakshi News home page

పాత గొడవల్లో ఉపాధ్యాయుడి మృతి

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

● రాత్రి వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ

నెల్లిమర్ల: పట్టణంలోని గాంధీనగర్‌ కాలనీలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చిన్న వాగ్వాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. దీనిపై పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం..రాత్రి సుమారు 9 గంటల సమయంలో గాంధీనగర్‌ కాలనీకి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు కుమరాపు సామన్న దొర (48), ఆటో డ్రైవర్‌ ఉరిటి రామచంద్ర మధ్య ఘర్షణ జరిగింది. వారికి రాత్రి భోజనం తర్వాత వాకింగ్‌ చేసే అలవాటు ఉంది. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి, ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. గొడవ సద్దుమణిగిన తర్వాత సామన్న దొర తన ఇంటికి చేరుకున్నారు. రామచంద్ర స్థానిక మిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే ఇంటి గేటు వద్దకు చేరుకోగానే సామన్న దొర ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. సామన్న దొర(48) విజయనగరం పట్టణంలోని మహారాజా సంస్కృత ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య, ఒక పాప, బాబు ఉన్నారు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తూ వారి మధ్య గతంలో కూడా కొన్ని పాత గొడవలు ఉన్నట్లు పేర్కొంది. ఆటో డ్రైవర్‌ ఉరిటి రామచంద్ర, ఆయన ఇద్దరు కుమారులు, స్థానిక జనసేన పార్టీ నాయకుడు జనాప్రసాద్‌ తన భర్తపై దాడిచేసి కొట్టినట్లు ఫిర్యాదులో మృతుని భార్య రమణమ్మ పేర్కొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ పి.లక్ష్మణమూర్తి, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై గోపాలరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అలాగే క్లూస్‌ టీమ్‌ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి అసలు కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు.

స్కూటీని లారీ ఢీకొని వ్యక్తి..

కొమరాడ: స్కూటీపై వెళ్తున్న వ్యక్తి వెనుక నుంచి లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటనపై కొమరాడ ఎస్సై కె.జగదీష్‌ నాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ బండి శ్రీనివాస్‌ (47) ఆదివారం పార్వతీపురం నుంచి కూనేరు వైపు స్కూటీపై వెళ్తుండగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన లారీ వెనుక నుంచి ఢీకొడంతో ప్రమాదం జరిగింది. టీపొడి అమ్ముకునే పనిలో భాగంగా శ్రీనివాస్‌ ఆదివారం ఉదయం కూనేరు వెళ్తుండగా కోటిపాం రైల్వే గేట్‌ సమీపంలో లారీ ఢీ కొనడంతో స్కూటీ లారీ కింద పడి పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. ఈ మేరకు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్సై తెలిపారు.

ఆటో ప్రమాదంలో యువకుడు..

రాజాం సిటీ: స్నేహితులతో కలిసి టపాసులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన రాజాం పట్టణ పరిధి చీపురుపల్లి రోడ్డులో ఆదివారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై మహ్మద్‌ సల్మాన్‌బేగ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ పరిధి మాదిగవీధికి చెందిన పెంట ఆనంద్‌ (23) దీపావళి సందర్భంగా టపాసులు కొనుగోలు చేసేందుకు స్నేహితులతో కలిసి ఆటోలో చీపురుపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణం వద్దకు వెళ్లాడు. టపాసులు కొనుగోలు చేసుకుని తిరుగు ప్రయాణమ య్యాడు. పెట్రోల్‌ బంకు సమీపంలో వాటర్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ ఎదురుగా వచ్చేసరికి రోడ్డుపై ఉన్న ఆవును తప్పించబోయిన ఆటో డ్రైవర్‌ కుడివైపు తిప్పి సడన్‌బ్రేక్‌ వేయడంతో డ్రైవర్‌ పక్కన కూర్చున్న ఆనంద్‌ రోడ్డు డివైడర్‌పై పడిపోవడంతో చెవి వద్ద గాయమై తీవ్రరక్తస్రావం జరిగింది. వెంటనే అదే ఆటోలో స్నేహితులు రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కేర్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement