టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిని మజ్జి సరిసహస్ర తీరుపై రగులుతున్న స్థానికులు
తెర్లాం ప్రజలంటే టీడీపీకి అంత చులకనా...?
విజయనగరం రూరల్: జెడ్పీ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరిసహస్ర తెర్లాం జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడంపై స్థానికులు, నాయకులు రగిలిపోతున్నారు. అధిష్టానం తీరును దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు తెర్లాం మండలం ఎక్కడుందో తెలియని ఆమెకు సీటు కేటాయించడంపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీకోసం పనిచేసిన తామంతా దద్దమ్మలమా అంటూ పలువురు బహిరంగంగా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎలా గెలుస్తుందో చూద్దాం అంటూ వాదనకు దిగుతున్నారు. విజయనగరం పట్టణంలోని ధర్మపురిలో నివసిస్తూ.. డెంకాడ మండలం మోపాడలో ఓటు ఉన్న సిరిసహస్రకు తెర్లాం జెడ్పీటీసీ టికెట్ ఏ ప్రాతిపదికన కేటాయించారని ప్రశ్నిస్తున్నారు. అంతవరకు ఒక్కసారి కూడా వెళ్లని ఊరిలో... ఇంకా చెప్పాలంటే ఎలా వెళ్లాలో తెలియని ఊరిలో ఏకంగా రాజకీయ ఆరంగేట్రం చేస్తూ అక్కడ స్థానిక నాయకులను పరిహసించడం ఇక్కడ విచిత్రం. ఎలాంటి వారినైనా డబ్బుతో కొనేయగలడం వీరి బలంకాదా..!.. వెనుకబాటు... ఆర్థిక లేమి ... ఇవన్నీ కలిపి స్థానిక నాయకులను వలసనేతల ముందు మోకారిల్లేలా చేస్తున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అక్కడ కార్యక్రమాలకు, ప్రజల మంచి చెడులకు హాజరైంది లేదు.. స్థానికేతకంగా ఆమె అక్కడ పోటీ చేయడానికి అర్హురాలే కావచ్చు.. కాని నైతికంగా ఆమెను బలపరచడమంటే ఓటర్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల నామినేషన్ పత్రాల్లోని చిరునామా.. ఆమెకున్న ఓటు హక్కు.. అసలు పోటీ చేస్తున్న ప్రాంతానికి మధ్య ఏ మాత్రం పొంతన లేకపోవడంతో ఆమె స్థానికతపై చర్చసాగుతోంది. ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి పెత్తనం చేయడానికి రావడం ఏంటి? గెలిపిస్తే సమస్యల పరిష్కారం కోసం తెర్లాం ప్రజలు విజయనగరం వెళ్లి వెతుక్కోవాలా అని అక్కడి వారు మండిపడుతున్నారు. స్థానికేతరులకు టికెట్ ఇచ్చి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన టీడీపీకి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గట్టి గుణపాఠం చెబుతామని స్థానికులు బహిరంగంగానే చెబుతున్నారు.


