యునాని వైద్యానికి స్వీపరే దిక్కు..! | - | Sakshi
Sakshi News home page

యునాని వైద్యానికి స్వీపరే దిక్కు..!

Nov 2 2026 1:53 AM | Updated on Nov 2 2026 1:53 AM

యునాని వైద్యానికి స్వీపరే దిక్కు..!

● వైద్యుడి నియామకంలో జాప్యం

● రోగులకు అందని వైద్యసేవలు

విజయనగరం ఫోర్ట్‌:

ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెబుతున్న కూటమి సర్కార్‌ మాటలు ప్రకటనలకే తప్ప అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వైద్యసేవలు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆయుష్‌శాఖలో భాగమైన యూనాని విభాగానికి స్వీపరే దిక్కయ్యాడు. యునాని విభాగానికి వైద్యుడు, కాంపౌండర్‌ లేక పోవడం వల్ల ఈ విభాగానికి వైద్యసేవల కోసం వచ్చే వారు వెనుదిరుగుతున్నారు. యునానిలో కొన్ని రకాల సమస్యలకు మంచి చికిత్స ఉంది. దీంతో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి చికిత్స కోసం వచ్చే రోగులకు చికిత్స అందని పరిస్థితి నెలకొంది. యునాని విభాగానికి ప్రభుత్వం వైద్యుడిని నియమించలేదు. ఇక్కడ పనిచేసే కాంపౌండర్‌ను వేరే చోటకు బదిలీ చేశారు. వైద్యుడు, కాంపౌండర్‌ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం భర్తీ చేయలేదు. దీంతో స్వీపర్‌ కమ్‌ స్కావెంజర్‌ ఈ విభాగానికి పెద్ద దిక్కుగా నిలిచాడు. వైద్యుడు, కాంపౌండర్‌ లేనప్పటికీ ప్రతిరోజూ యునాని డిస్పెన్సరీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వీపర్‌ ఉంటున్నాడు.

మందులు ఉన్నా అందించే దిక్కు లేదు:

యునానిలో చర్మ సంబంధిత సమస్యలు (బొల్లి మచ్చలు) కీళ్ల నొప్పులు, దగ్గు, జలుబు, జ్వరం, గ్యాస్టిక్‌, సీ్త్రల వ్యాధులకు మంచి మందులు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని అందించే నాథుడే కరువయ్యాడు. యునాని వైద్యం గురించి తెలిసిన రోగులు ప్రతిరోజు వస్తుంటారు. అయితే చికిత్స అందించే వారు లేక పోవడంతో వారు వెళ్లి పోతున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం

యునాని విభాగానికి రెగ్యులర్‌ నియామకాల కోసం ప్రభుత్వానికి లెటర్‌ రాశాం. బుధ, శనివారాల్లో భోగాపురం యునాని వైద్యుడు డిప్యుటేషన్‌పై సేవలు అందిస్తున్నారు.

డాక్టర్‌ శ్రీనివాస్‌రావు, ఆర్‌డీడీ, ఆయుష్‌శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement