● చిన్న శ్రీనూ.. ఇదేనా మీ సంస్కృతి?
● సిరి సహస్ర నామినేషన్లపై రేగిడి లక్ష్మణరావు అభ్యంతరం
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఉత్తరాంధ్రలో కొత్త సంస్కృతికి తెరలేపారని, కుల ధ్రువీకరణ పత్రాల వ్యవహారంతో బీసీల రిజర్వేషన్ హక్కులకు భంగం కలిగించే ప్రయత్నం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు మండిపడ్డారు. ఆదివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాలకు సిరి సహస్ర దాఖలు చేసిన నామినేషన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సిరి సహస్రకు బీసీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ, నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించారా? లేదా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్ హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే ఆమె నామినేషన్లను తిరస్కరించాలని కోరారు.
సిరి సహస్ర నామినేషన్లపై విచారణ జరపాలి
సిరి సహస్ర జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల జాబితాలో ఆమె పేరు ‘ముస్కాన్ జైన్’గా నమోదై ఉందనే అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాలకు బీసీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఆమె నామినేషన్లు దాఖలు చేయడంపై అభ్యంతరాలు ఉన్నాయన్నారు. సంబంధిత పత్రాల చెల్లుబాటు, ఆమె అర్హతపై అధికారులు సమగ్ర విచారణ జరపాలని కోరారు. జెడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్‌కు జనరల్ కేటగిరీలో రూ.6 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉండగా, బీసీ కేటగిరీ కింద రూ.3 వేలు మాత్రమే చెల్లించిన వ్యవహారంపై ఎన్నికల అధికారులు వివరణ ఇవ్వాలన్నారు. సిరి సహస్ర నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటిని ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని బీసీల రిజర్వేషన్ హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.


