డీఆర్వోను కలిసిన అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై, కొందరు అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. పూసపాటిరేగ జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ తరపున నామినేషన్ వేసిన బొత్స చైతన్య నామినేషన్‌ను చిన్నపాటి సాంకేతిక కారణాలు చూపి కావాలనే రిజెక్ట్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే బొత్స చైతన్యపై వివక్ష చూపించి నామినేషన్‌ను రద్దు చేసిన ఎన్నికల అధికారులు, ఇక్కడ కొత్తవలసలో ఇంతటి పచ్చి మోసాన్ని ఎలా ప్రోత్సహిస్తారు. చంద్రబాబు, నారా లోకేష్ బీసీల హక్కులను కాలరాసేందుకు తెగబడ్డారు. బీసీ మహిళకు కేటాయించిన జెడ్పీ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనతో, ఒక ఓసీ మహిళను దత్తత పేరిట తెరపైకి తెచ్చి తప్పుడు బీసీ సర్టిఫికెట్ సృష్టించారు. ఆమె టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో ముస్కాన్ జైన్, తండ్రి రమేశ్‌కుమార్ జైన్ అని స్పష్టంగా నమోదై ఉండగా అలాంటి ఓసీ మహిళకు తహసీల్దార్ ఏ విధంగా బీసీ–డీ సర్టిఫికెట్ ఇస్తారు. దాన్ని రిటర్నింగ్ అధికారి ఎలా స్వీకరిస్తారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంటనే స్పందించి ఈ అక్రమ నామినేషన్‌ను రద్దు చేయాలి. లేదంటే వైఎస్సార్సీపీ తరఫున హైకోర్టును ఆశ్రయించి తేల్చుకుంటాం. –బెల్లాన చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు


