జాతరలో అత్యంత కీలకమైన ‘సిరిమానోత్సవం’ తరలించే ఏర్పాట్లు మంగళవారం ఉద యం ప్రారంభం కానుంది. హుకుంపేటలోని ఆలయ అనువంశిక పూజారి బంటుపల్లి వెంకటరావు నివాసం వద్ద సిద్ధమైన 60 అడుగుల పవిత్ర చింతమాను (సిరిమాను)తో పాటు అంజలి రథం, పాలధార, చేపల వల, తెల్ల ఏనుగు రథాలు ఉదయం 10 గంటలకే చదురుగుడికి చేరుకుంటాయి. నాటి రాజుల వైభవాన్ని, రాజరికపు ఠీవిని నేటి తరానికి చాటిచెప్పేలా తెల్ల ఏనుగు రథాన్ని దాదాపు 300 ఏళ్లుగా ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రథాలను రణస్థలానికి చెందిన రమణ కుటుంబీకులు గడచిన 40 ఏళ్లుగా ఎంతో నిష్ఠతో తయారు చేస్తున్నారు. ఆ రోజు ఉద యం అమ్మవారి వేషధారణలో పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానుపై అధిరోహించి భక్తులకు అభయమిస్తారు.


