రెండేళ్లుగా ఆ ఒక్కరే... | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లుగా ఆ ఒక్కరే...

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

చిత్రంలో రోడ్డుపై ఉన్న రాళ్లు, రప్పలను పక్కకు తీస్తున్నది ఎస్‌.కోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలోని మున్నపురాయి, రాయపాలెం, విప్పమానవలస గిరిజన గ్రామాల చిన్నారులు. వీరంతా ప్రతిరోజూ కాపుసోంపురంలోని పాఠశాలకు వెళ్లే రోడ్డు రాళ్లుతేలి అధ్వానంగా మారింది. రాళ్లు తన్నుకుని పడిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు బాగుచేయాలంటూ ఇప్పటికే పలుసార్లు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఫొటోలు పట్టుకుని చేతులు జోడించారు. అధికారులకు విన్నవించారు. స్పందన లేకపోవడంతో... శుక్రవారం గాంధీ జయంతి రోజు స్కూల్‌కు సెలవుకావడంతో చిన్నారులందరూ కలిసి తమ చిట్టిచేతులతో రోడ్డుపై ఉన్న రాళ్లను పక్కకు వేశారు. మహాత్మా.. మా రోడ్డును చూడండి అంటూ ప్రార్థించారు. చిన్నారులు శ్రమించడాన్ని చూసిన వారు అయ్యో... అంటూ నిట్టూర్చారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ఇదేనా అంటూ పాలకుల పనితీరును దుమ్మెత్తిపోశారు. – శృంగవరపుకోట

ఈ చిత్రం చూశారా... ఒక విద్యార్థిని.. ఒక ఉపాధ్యాయుడు ఉన్నది దత్తిరాజేరు మండలంలోని చినవంగర ప్రాథమిక పాఠశాల. ఇక్కడ రెండో తరగతి వరకే చదివే అవకాశం ఉంది. గతంలో ఇక్కడ రెండో తరగతి చదవిన బాలిక మూడో తరగతి కోసం వంగర ప్రభుత్వ పాఠశాలలో చేరింది. కొత్తగా మళ్లీ రిషిత అనే ఒకే విద్యార్థిని ఈ ఏడాది చేరింది. ఇక్కడ ఇటీవల నిర్వహించిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో ఆ బాలిక తండ్రిని చైర్మన్‌గా ఎంపిక చేశారు. డైరెక్టర్లు, వైస్‌ చైర్మన్‌ పదవులన్నీ ఖాళీయే. ఒకేఒక్క బాలిక కోసం ఉపాధ్యాయుడు, భోజన నిర్వాహకురాలు, ఆయా జీతం కలిసి సుమారు లక్ష వరకు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. కూటమి ప్రభుత్వం తీరుతో ఊరిబడిపై పిల్లలకు ఆసక్తి సన్నగిల్లుతుందనేందుకు ఈ పాఠశాలే నిలువెత్తు సాక్ష్యం అన్న వాదన వినిపిస్తోంది. ఉపాధ్యాయుడు ఇంటింటికీ వెళ్లి పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరినా తల్లిదండ్రులు స్పందించకపోవడం గమనార్హం. – దత్తిరాజేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement