విజయనగరం ఫోర్ట్:
ఎట్టకేలకు చంద్రబాబు సర్కార్ కరువు మండలాలను ప్రకటించింది. ఇందులో విజయనగరం జిల్లాలో తీవ్ర కరువు మండలాలు 10, మధ్యస్థ కరువు మండలాలు 12 ఉన్నాయి. జిల్లాలోని 27 మండలాలకు 22 మండలాల్లో కరువు అలుముకుంది. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి వరుణుడు మొఖం చాటెయ్యడంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల నారుమడులు ఎండిపోవడంతో రైతులు సాగు చేయకుండా వదిలేశారు. మరికొన్ని చోట్ల వెద పద్ధతిలో సాగుచేసిన వరి పంట ఎండిపోయింది. వర్షాభావంతో పంటపొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. వెద, వరి నారు మడులను కాపాడుకునేందుకు రైతులకు పెట్టుబడి తడిసిమోపైడెంది. సకాలంలో వర్షం కురవకపోవడంతో పంటలు ఎండిపోయి పెట్టుబడి మట్టిలో కలిసిపోయింది. జిల్లాలో నమోదైన వర్షపాతం ఆధారంగా ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. జిల్లాలో 53.4 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ నుంచి ఆగస్టు నెలఖారు నాటికి కురవాల్సిన వర్షపాతం 424.3 మి.మీకాగా 197.6 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది.
కరువు మండలాలు ఇవే..
ఎస్.కోట, వేపాడ, కొత్తవలస, జామి, పూసపాటిరేగ, దత్తిరాజేరు, చీపురుపల్లి, బొండపల్లి, వంగర, రాజాం మండలాల్లో తీవ్ర కరువు నెలకొంది. మెరకముడిదాం, గరివిడి, గుర్ల, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, గజపతినగరం, ఎల్.కోట, మెంటాడ, నెల్లిమర్ల, భోగాపురం, విజయనగరం అర్బన్‌లను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు.
అందని కరువు సాయం
కరువు మండలాలు ప్రకటించినా ఆదుకునే చర్యలు కానరావడంలేదు. ప్రత్నాయ పంటల సాగుకు రాయితీపై విత్తనాలు అందించాలని కోరుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మరోవైపు ఇటీవల తుఫాన్ వర్షాలకు పాడైన పంటలకు పరిహారం అందుతుందోలేదోనన్న బెంగ రైతులను వెంటాడుతోంది.
10 మండలాల్లో తీవ్ర, 12 మండలాల్లో మధ్యస్థ కరువు పరిస్థితులు
తల్లడిల్లుతున్న రైతు కుటుంబాలు
ఆదుకునే చర్యలు శూన్యం


