విజయనగరం: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పీఎస్‌ఎస్‌వీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపుమేరకు ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ఆరిపాక రాము, నార్ల మహంతి సన్యాసిరావుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమానికి ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టరేట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కొద్దిసేపు నిరసన కార్యక్రమం జరిగిన అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, కలెక్టర్ రామసుందర్ రెడ్డికి సంఘం నాయకులు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ అపరిష్కృతంగా నిలిచి ఉన్న జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో మీడియా ప్రసారాలపై నియంత్రణ లేకుండా పోయిందని, నియంత్రణ కోసం మీడియా కమిషన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కోసం రక్షణ చట్టాలు తేవాలని, వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరిపాక రాము, నార్లమహంతి సన్యాసిరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, ఆరోగ్య బీమా అమలుకు పర్యవేక్షణ కమిటీలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులను చేర్చాలని, జర్నలిస్టులకు రైల్వే రాయితీపాస్‌లు ఇవ్వాలని, రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంఎస్‌ఎన్ రాజు, మీడియా కమిటీ జిల్లా కన్వీనర్ లింగాల నరసింగరావు, అర్బన్ కమిటీ అధ్యక్షుడు గొట్టాపుత్రినాథ్, సీనియర్ జర్నలిస్టులు పంచాది అప్పారావు, కేజే శర్మ, వైఎస్ పంతులు, విజయభాస్కర్, కర్రోతు దేవి పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.


