రాజాం/వంగర/రేగిడి/సంతకవిటి:
ఇటీవల తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు నాగావళి నదితో పాటు వాగులు, కాలువలు పొంగి ప్రవహించాయి. తీర గ్రామాలను వరద ముంచెత్తింది. ఎక్కడికక్కడే కాలువలకు గండ్లు పడ్డాయి. పంటలు నీటమునిగాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల కోతకుగురయ్యాయి. వరద తగ్గుతున్నకొద్దీ రైతులు, ప్రజలను బురద కష్టాలు వెంటాడుతున్నాయి. పంటలు పూర్తిగా పాడైనా పట్టించుకునేవారే లేకపోవడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. వరద ముంపు భారిన పడిన పొలాలను చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇంటిల్లిపాదీ పంట సస్యరక్షణలో నిమగ్నమవుతున్నారు.
తీర గ్రామాల్లో పెరుగుతున్న సమస్యలు
రాజాం నియోజకవర్గంలోని వంగర, రేగిడి, సంతకవిటి మండలాల్లో నాగావళి నదీ తీరం విస్తరించి ఉంది. వంగరలో కోతులగుమ్మడ గ్రామం నుంచి సంగాం వరకూ, రేగిడిలో సరసనాపల్లి గ్రామం నుంచి ఖండ్యాం వరకూ, సంతకవిటిలో జావాం నుంచి కావలి వరకూ నాగావళి నది ప్రవహిస్తుంది. ఈ తీర గ్రామాల్లో వంగర మండలంలో కోతులగుమ్మడ, వీవీఆర్‌పేట, పెదరాజులగుమ్మడ, చిన్నరాజులగుమ్మడ, రుషింగి, తలగాం, శివ్వాం, ఓనె అగ్రహారం, ఓనె మగ్గూరు, సంగాం గ్రామాల్లోనూ, రేగిడి మండలంలో సరసనాపల్లి, తునివాడ, సంకిలి, పుర్లి, దేవుదళ, ఖండ్యాం, కొమెర, వెంకటాపురం, ఆడవరం, గ్రామాలు వద్ద నదిలో ప్రవాహంపెరిగితే ఆందోళన తప్పడం లేదు. సంతకవిటి మండలంలో జావాం, కేఆర్‌పురం, పోతులజగ్గుపేట గ్రామాల వద్ద కూడా ఇదే పరిస్థితి.
● నదీ తీరంలో వరి, చెరకు పంటలన్నీ వరదల సమయంలో ముంపునకు గురవుతున్నాయి. మూడు రోజుల కిందట తుఫాన్ వర్షాలకు ఇదే పరిస్థితి. ఇప్పటికీ చెరకు, వరి పంటలు నీటిలోనే కనిపిస్తున్నాయి. నాగావళి ఓపెన్ హెడ్ సాయన్నచానల్ ఈ ఏడాది తుఫాన్ వరదలకు మొత్తం కొట్టుకుపోయింది. రేగిడి మండలం సంకిలి నుంచి సంతకవిటి మండలం వాల్తేరు వరకు ఈ కాలువ ఆయకట్టు పరిధిలో సెంటు భూమిలో కూడా వరి, చెరకు పంటలు నిలవలేదు. రాజాం నియోజకవర్గంలోని నదీతీర ప్రాంతాలు, కాలువల ఆయకట్టులో 15 వేల ఎకరాల్లో పంటలు ముంపునకుగురైనట్టు రైతులు చెబుతున్నారు. ఇప్పటివరకు రైతులను ఆదుకునే అధికారిక ప్రకటనలు, పరిశీలనలు లేకపోవడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నాగావళి నదీ తీర గ్రామాల్లోని రైతులకు అష్టకష్టాలు
పాడైన పంటను చూసి కన్నీరు
కోతకు గురైన రోడ్లు
కొట్టుకుపోయిన కాలువలు
మునిగిన పంటలు
ఎక్కడ చూసినా బురదకష్టాలే..
పట్టించుకోని ప్రభుత్వం
ఆవేదనలో రైతాంగం
వరద కష్టాలు వీడలేదు..
ఇప్పటికీ కొమెర, వెంకటాపురం, ఖండ్యాం తదితర గ్రామాల్లో వరద నీరు పొలాల్లోనే కనిపిస్తోంది. ఏ అధికారి రాలేదు. ఎటువంటి భరోసాను ఇవ్వలేదు. రోడ్లు పాడైపోయాయి. ఆటోలు వంటివి ఊర్లోకి రావడం లేదు. గ్రామాల్లో తాగునీటి సరఫరా ఇంతవరకూ పునరుద్ధరించలేదు. పోయిన పంటలకు పెట్టుబడి డబ్బులైనా ప్రభుత్వం ఇస్తుందో లేదో తెలియడం లేదు. మాది ఐదెకరాల వరి పంట పోయింది. గ్రామంలో 600 ఎకరాల వరి పంటలో బురదమేటలు ఉన్నాయి. ప్రభుత్వం ఆదుకోకుంటే మా పరిస్థితి చాలా దుర్భరంగా మారిపోతుంది.
– కర్నేన శరత్‌కుమార్, రైతు,
ఆడవరం, రేగిడి మండలం
వరి పంట మొత్తం పోయింది
మేం ఈ ఏడాది వేసిన రెండెకరాల వరి పంట తుఫాన్ వర్షాలకు కొట్టుకుపోయింది. నారాయణపురం కుడి కాలువ, సాయన్నచానల్ కాలువల నీటితో పంట ముంపునకు గురైంది. పంటపొలాల్లో నీరు సముద్రంలా కనిపిస్తోంది. పొలాల్లో నీరు తగ్గినచోట బురద, ఇసుకమేటలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా ఉంది. ఇలా అయితే రైతులు ఎలా బతుకుతారు. పరిహారం అందజేసి ఆదుకోవాలి.
– వై.పద్మావతి, రామారాయపురం,
సంతకవిటి మండలం
కష్టాల తీరం..
రైతన్నకు అండగా నిలిచే నదీ తీరం ఇప్పుడు కష్టాలను తెచ్చిపెడుతోంది. ప్రజాప్రతినిధుల అండదండలతో రూ.కోట్ల ఆర్జనే లక్ష్యంగా ఇష్టానుసారంగా సాగుతున్న ఇసుకరీచ్‌ల నిర్వహణతో నాగావళిలో నీటి ప్రవాహం దిశ మారుతోంది. తీర గ్రామాలను వరద ముంచెత్తుతోంది. భారీ లోడులతో ఇసుక లారీలు తిరగడంతో రోడ్లు, కాలువలు, చెరువు గట్లు అధ్వానంగా తయారవుతున్నాయి. వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతున్నాయి. తుఫాన్ వస్తే చాలు తీర గ్రామాల ప్రజల్లో వణుకుపుడుతోంది. పంటలు ముంపునకు గురై రైతులు నష్టాలు చవిచూస్తున్నారు.
రోడ్డు అలానే ఉంది
వర్షాలు వచ్చి నాలుగైదురోజులు గడిచింది. సాయన్నచానల్ వరదలకు జావాం–శంకరపేట గ్రామాల మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. ఇంతవరకూ ఈ రోడ్డును కనీసం చదునుచేయలేదు. ఆటోలు పూర్తిగా రావడం లేదు. గ్రామంలో ఏదైనా అత్యవసరమైతే ఎలా వెళ్లాలో తెలియడం లేదు. సాయన్నచానల్ ఆయకట్టులోని వేలాది ఎకరాలు వరి, చెరకు పంటలు పోయాయి. నదీతీరాన ఉన్న చెరకు మొత్తం నదిలో కొట్టుకుపోయింది. రైతులను ఆదుకునే చర్యలు కానరావడంలేదు.
– బోనెల ప్రసాదరావు,
మాజీ సర్పంచ్, జావాం, సంతకవిటి మండలం
నాగావళి నదిలో 24 గంటలు, 365 రోజులు భారీ ఇసుకరీచ్‌లు నడుపుతున్నారు. ఇందులో అక్రమ రీచ్‌ల నిర్వహణ తీర గ్రామాల ప్రజలకు వరద ముప్పును తెచ్చిపెట్టింది. ఇసుక లారీల రాకపోకలతో నదీ తీర గ్రామాల్లోని రోడ్లు, గట్లు అధ్వానంగా మారడం, బలహీనం కావడంతో వరదల సమయంలో కొట్టుకుపోయాయి. పంటల ముంపుతో పాటు ప్రజలకు కష్టాలు తెచ్చాయి. పంటలు బురదలోనే దర్శనమిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పరిహారం అందించేవారు కరువయ్యారని రైతులు చెబుతున్నారు. అధికార పార్టీ నేతలు ఫొటోలకు ఫోజులిస్తున్నారే తప్ప పరిహారం కోసం మాట్లాడేవారే లేరని విమర్శిస్తున్నారు. రాకపోకలు నిలిచిపోయినా కాజ్‌వేలు, రోడ్లు బాగుకు తక్షణ చర్యలు కానరాకపోవడంపై ఆందోళన చెందుతున్నారు.


