● రాష్ట్ర స్థాయి స్కూల్‌గేమ్స్ పోటీలకు
జిల్లా జట్ల ఎంపిక
విజయనగరం: విజయనగరం జిల్లాలో క్రీడా సందడి ప్రారంభమైంది. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే స్కూల్ గేమ్స్ జిల్లా జట్ల ఎంపిక పోటీలకు మొదటి రోజు సోమవారం మంచి స్పందన లభించింది. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి విజయనగరం ప్రాతిపదికన నిర్వహించిన ఎంపిక పోటీలకు క్రీడాకారులు తరలివచ్చారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని విజ్జీ స్టేడియం ప్రాంగణంలో అండర్–17,19 విభాగాల్లో బాల, బాలికలకు, అండర్ –14 విభాగంలో బాలురకు బాక్సింగ్ క్రీడాంశంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్–17 బాల, బాలికల విభాగంలో డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. విజయనగరం జిల్లా కేంద్రంలోని సిటీ క్లబ్ ప్రాంగంణంలో అండర్–14,17,19 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు లాన్‌టెన్నిస్ క్రీడాంశంలో ఎంపికలు చేపట్టారు. నగర శివారులోని విజ్జీ స్టేడియంలో అండర్–19 విభాగంలో బాలుర క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించారు. ఇక్కడ ప్రతిభ చూపినవారు రాష్ట్ర స్థాయి పోటీలకు విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు ఆర్.వాణిశ్రీ, బి.శ్రీనివాసరావు తెలిపారు.


