● అప్పుల బాధతో జలాశయంలో దూకిన వ్యక్తి
● రెండు రోజుల గాలింపు తర్వాత
మృతదేహం వెలికితీత
పాచిపెంట: ఇంట్లో తండ్రి పెద్దకర్మ జరుగుతున్న వేళ.. కుటుంబానికి అండగా ఉండాల్సిన వ్యక్తి ఇక లేడన్న వార్త ఆ ఇంటిని కన్నీటిలో ముంచేసింది. ఒకవైపు తండ్రి జ్ఞాపకాలతో కుటుంబసభ్యులు విషాదంలో ఉండగానే..మరోవైపు కొడుకు మృతదేహం జలాశయం నుంచి వెలికితీయడం కొత్తవలస గ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడి అప్పుల పాలయ్యానని, ఆ బాధతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పాచిపెంట మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన చిత్త వీర్రాజు (44)లేఖ రాసి ఆదివారం పెద్దగెడ్డ జలాశయంలో దూకేసిన నేపథ్యంలో సమాచారం మేరకు ఎస్సై లాలం అర్జున్ ఆధ్వర్యంలో స్థానిక గజ ఈతగాళ్లతో రెండు రోజుల పాటు గాలింపు చేపట్టారు. సోమవారం సాయంత్రం వీర్రాజు మృతదేహం జలాశయంలో లభ్యమైంది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పిల్లల జీవితాలు నిలదొక్కుకుంటున్న వేళ..
వీర్రాజుకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు గతేడాది వివాహం జరిగింది. కుమారుడు అగ్నివీర్‌కు ఎంపికై ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలిద్దరూ జీవితంలో ఓ దారిని ఏర్పరుచుకుంటున్న సమయంలో.. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వీర్రాజు దూరం కావడం బంధువులను, గ్రామస్తులను కలిచివేసింది.
ఒకే రోజు రెండు విషాదాలు..
వీర్రాజు తండ్రి పెద్దకర్మ సోమవారమే జరిగింది. తండ్రి పెద్దకర్మ కార్యక్రమం జరుగుతున్న రోజే వీర్రాజు మృతదేహం జలాశయం నుంచి వెలికితీయడం కుటుంబసభ్యులకు మరింత విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబంలో ఒకే రోజు సంభవించిన వరుస విషాదాలతో కొత్తవలసలో విషాదఛాయలు అలుముకున్నాయి...


