ఘనంగా కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

బాధ్యతతో ముందుకు సాగాలి

● మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

● విజయనగరం పీటీసీలో శిక్షణ

పూర్తిచేసుకున్న 473 మంది

మహిళా కానిస్టేబుళ్లు

● పాల్గొన్న హోంమంత్రి అనిత

డెంకాడ: పోలీస్‌ యూనిఫాం కేవలం కఠినత్వానికి ప్రతీక కాదని, దాని వెనుక కరుణ, మానవత్వం, తీవ్రమైన బాధ్యత ఉంటాయని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలసలోని ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌న్‌ పరేడ్‌ మైదానంలో 191 మంది స్టైపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ సోమవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సంధ్యారాణి పరేడ్‌ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. శిక్షణ కాలంలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టుబుళ్లు డి.నాగదుర్గా ప్రసాద్‌, పి.గణనసాయి, పి. ఏసు రత్నంకు మెడల్స్‌ అందజేశారు. 5వ బెటాలియనన్‌ కమాండెంట్‌ వై. రవిశంకర్‌ రెడ్డి మాట్లాడుతూ, 9 నెలల పాటు కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న 191 మంది శిక్షణార్థులలో 15 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 125 మంది గ్రాడ్యుయేట్లు, 23 మంది ఇంజినీరింగ్‌, 68 మంది సాంకేతిక విద్యార్హతలు ఉన్నవారు ఉన్నారని తెలిపారు. నూతన కానిస్టేబుళ్లను శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, ప్రకాశం, చిత్తూరు బెటాలియన్లకు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ వేడుకల్లో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, బెటాలియన్‌ కమాండెంట్లు, అధికారులు, సిబ్బంది, శిక్షణార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

విజయనగరం టౌన్‌:

విజయనగరం పోలీస్‌ శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తిచేసుకున్న 473 మంది 2025–26 బ్యాచ్‌ మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కళాశాల మైదానంలో సోమవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ పోలీస్‌ వ్యవస్థకు కానిస్టేబుల్‌ వెన్నెముకగా పేర్కొన్నారు. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడంతో పాటు మానసిక స్థైర్యంతో ముందడుగు వేయాలని సూచించారు. తొమ్మిది నెలల కఠిన శిక్షణ జీవితానికి పునాదిలాంటిదన్నారు. పోలీస్‌ ఉద్యోగమంటేనే ఎంతో బాధ్యతతో కూడినదని, సమాజంలో ఎంతో ప్రభావంతమైనదని పేర్కొన్నారు. ముందుగా కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. శిక్షణలో మెరుగైన ప్రతిభ చూపిన కేడెట్స్‌కు జ్ఞాపిలు అందజేశారు. పీటీసీలో నూతనంగా నిర్మించిన కంప్యూటర్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజల ధనమానప్రాణాలను రక్షించే కీలక బాధ్యత పోలీస్‌ వ్యవస్థపై ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులనాయుడు, ఇందుకూరి రఘురాజు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పీటీసీ ప్రిన్సిపాల్‌ దంతులూరి రామచంద్రరాజు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.కోటేశ్వరబాబు, అడిషనల్‌ ఎస్పీలు సీహెచ్‌ శ్రీకాంత్‌, ఎస్‌.వాసుదేవ్‌, డీఎస్పీలు, సీఐలు, ఇతర అధికారులు, కేడెట్స్‌ తల్లిదండ్రులు పాల్గొన్నారు. సరిపడా టెంట్‌లు వేయకపోవడంతో పోలీస్‌ కానిస్టేబుళ్ల తల్లిదండ్రులు ఎండలోనే తమ పిల్లల డ్రిల్‌ను తిలకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement