విజయనగరం గంటస్తంభం: జిల్లాలో రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత, కచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. గురువారం రీసర్వే, పట్టాదారు పాస్‌బుక్కులు, ఈ–కేవైసీ, వెబ్‌ల్యాండ్–2 పోర్టింగ్, ప్రింటింగ్ పురోగతిపై వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 487 గ్రామాలు రీసర్వే పరిధిలో ఉండగా, ఫేజ్–1, 2, 3లో 111 గ్రామాలు పూర్తయ్యాయి. ఫేజ్–4లోని 126 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూథింగ్, వెక్టరైజేషన్ పూర్తియినందున తదుపరి దశలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అక్టోబర్‌లో చేపడుతున్న 80 గ్రామాల్లో 52,597 ఖాతాలను సంబంధించి 81,458.77 ఎకరాలు నమోదయ్యాయని, 32,136 డ్రాఫ్ట్ పీపీబీల్లో 26,086 ఖాతాలకు ఈ–కేవైసీ పూరై చేసుకోగా, మరో 3 గ్రామాలు ప్రింటింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వివరించారు. సిద్ధంగా ఉన్న గ్రామాలను వెంటనే తదుపరి దశకు తీసుకెళ్లాలని, పెండింగ్ పనులను రోజువారీగా పర్యవేక్షించాలని జేసీ ఆదేశించారు. ప్రోగ్రెస్ రిపోర్టులకు, వాస్తవ పెండింగ్‌కు తేడా ఉండటంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తప్పుడు గణాంకాలతో కాలయాపన చేయకుండా వాస్తవ డేటానే నివేదించాలని తుది హెచ్చరిక జారీ చేశారు. సర్వేయర్లు, తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో పనులను తనిఖీ చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, రీసర్వే ద్వారా భూ యాజమానులకు కచ్చితమైన, పారదర్శకమైన రికార్డులు అందించడమే లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేశారు.


