స్పెషల్‌ ఆఫీసర్‌ మాటున... రూ.కోట్ల దోపిడీకి స్కెచ్‌! | - | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ ఆఫీసర్‌ మాటున... రూ.కోట్ల దోపిడీకి స్కెచ్‌!

Sep 4 2026 2:06 AM | Updated on Sep 4 2026 2:06 AM

స్పెషల్‌ ఆఫీసర్‌ మాటున... రూ.కోట్ల దోపిడీకి స్కెచ్‌!

ప్రైవేటు కంపెనీలకు మున్సిపల్‌ నిధులు ధారాదత్తం

స్పెషల్‌ ఆఫీసర్‌ సంతకంతో భారీ ప్రాజెక్టుల ఆమోదం!

అడ్డగోలు వడ్డీ దోపిడీ.. బ్యాంకుల కంటే నాలుగింతల అదనం

ఏకంగా 5.69 శాతం అధిక వడ్డీ భారం ప్రజల ఆస్తులు ఎస్క్రో ఖాతాలోకి..

నగర ప్రజలపై ‘హైబ్రీడ్‌’ భారం వేసేందుకు చంద్రబాబు సర్కార్‌ కుట్ర!

విజయనగరం అర్బన్‌: తన సొంత కాళ్లపై నిలబడుతూ ఏటా రూ.కోట్ల ఆదాయాన్ని సముపార్జించుకుంటున్న మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిధులపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కన్ను పడింది. పట్టణ వాసుల సొమ్మును, వారి ఆస్తుల భద్రతను ప్రైవేట్‌ కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లో పెట్టేందుకు చంద్రబాబు సర్కార్‌ అడ్డగోలు ‘హైబ్రీడ్‌’ స్కెచ్‌ వేసింది. రోడ్డు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పార్కుల సమగ్ర అభివృద్ధి పేరుతో ‘హైబ్రీడ్‌ యాన్యుటీ మోడల్‌’ (హెచ్‌ఏఎం)ని తీసుకొస్తూ మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ జారీ చేసిన రహస్య ఉత్తర్వులు ఇప్పుడు పట్టణ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, ఎన్నుకోబడిన పాలకమండలి లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని, స్పెషల్‌ ఆఫీసర్లతో ‘అత్యవసర’ సంతకం చేయించి మున్సిపాలిటీల ఆర్థిక మూలాలను ప్రైవేట్‌ ఏజెన్సీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్దమైంది.

ప్రైవేటు ఏజెన్సీలోకి రూ.కోట్లు కుమ్మరించే కుట్ర

విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్నులు, ప్రకటనల రుసుంలు, నీటి పన్నులు, వివిధ అనుమతుల ద్వారా విజయనగరం కార్పొరేషన్‌ ఏడాదికి రూ.150 కోట్లకు పైగా ఆదాయాన్ని గడిస్తోంది. ఈ నిధులతో మున్సిపాలిటీయే సొంతంగా రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టే వెసులుబాటు స్పష్టంగా ఉంది. అయితే ఈ ప్రజాధనాన్ని ప్రైవేటు కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్లించడానికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రూ.7,469.46 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు తెచ్చినట్లు మున్సిపల్‌ శాఖ ఇటీవల ప్రకటించింది. నగరంలో సామాన్య ప్రజలు తమ కష్టార్జితంతో నిర్మించుకున్న ఇళ్లు, కొనుగోలు చేసిన స్థలాల క్రమబద్ధీకరణ కోసం చెల్లించే బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌, రుసుములు, ఎంఐజీ, ఎస్‌ఐజీ లేఅవుట్ల అమ్మకాల నిధులను కార్పొరేషన్‌ నుంచి లాక్కొని నేరుగా ప్రైవేటు కాంట్రాక్టర్‌ ఇచ్చే ‘ఎస్క్రో ఖాతా’లో జమ చేయాలని జీఓలో స్పష్టం చేశారు. అంటే, కార్పొరేషన్‌కు రావాల్సిన ప్రధాన ఆదాయ మార్గాలన్నీ ముందే ప్రైవేటు ఏజెన్సీల జేబుల్లో వెళ్లిపోతాయి.

ఈ ప్రాజెక్టు ఒప్పందంలో జరిగిన అక్రమాలు ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని అగ్రగామి బ్యాంకుల సగటు ఎంసీఎల్‌ఆర్‌ (బ్యాంకుల రుణ వడ్డీ రేటును నిర్ణయించే కీలక ప్రమాణమైన) 1.25 శాతం మాత్రమే ఉంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు బహుమతిగా ఇస్తున్న వడ్డీ రేటు ఏకంగా 5.69 శాతం. ప్రైవేట్‌ కంపెనీలు పెట్టే 60 శాతం పెట్టుబడికి ప్రభుత్వం పది సంవత్సరాల్లో 40 త్రైమాసికాల్లో 5.69 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది బ్యాంకుల కంటే నాలుగింతలు అదనంగా వడ్డీ కట్టిస్తూ ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. ప్రైవేటు సంస్థలతో ఉన్న ‘కమిషన్ల’ లాలూచీ కోసమే ఈ స్థాయిలో వడ్డీలు చెల్లిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజాస్వామ్యాన్ని పాతరేసి..

స్పెషల్‌ ఆఫీసర్‌తో సంతాలు!

ఇంతటి భారీ దోపిడీ పథకానికి ఆమోదం తెలిపేందుకు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల పాలకమండలి లేకపోవడమే ప్రభుత్వానికి కలిసివచ్చింది. ప్రజల పక్షాన ప్రశ్నించే మేయర్‌, కార్పొరేటర్లు ఉంటే ఈ అన్యాయాన్ని కౌన్సిల్‌లో తిప్పికొడతారనే ఉద్దేశంతోనే, ‘అత్యవసర తీర్మానాలు చేయాలి’ అంటూ స్పెషల్‌ ఆఫీసర్లకు ఐఏఎస్‌ అధికారి ద్వారా ఆదేశాలు పంపించారు. ప్రజాభిప్రాయాన్ని బొందపెట్టి, నగరం భవిష్యత్తును ప్రైవేట్‌ కార్పొరేట్‌ కంపెనీల వద్ద కుదువపెట్టే ఈ ‘హైబ్రీడ్‌ నిర్ణయాన్ని పట్టణ వాసులు, పౌర సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి.

ప్రజలు, ఆస్తులపై తీవ్ర ప్రభావం

కార్పొరేషన్‌ నిధులన్నీ ప్రైవేట్‌ ‘యాన్యుటీ’ వాయిదాలకే సరిపోతే, రేపు నగరంలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ఉద్యోగులు–కార్మికులల జీతభత్యాలు చెల్లించడానికి సొమ్ములేని పరిస్థితి వస్తుంది. రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పార్కుల నిర్వహణ బాధ్యతలను పదేళ్ల పాటు ప్రైవేటు ఏజెన్సీలకే కట్టబెడం వల్ల వారు నిర్వహణ సరిగ్గా చేయకపోయినా ప్రశ్నించే హక్కు కార్పొరేషన్‌కు ఉండదు. ఎస్క్రో ఖాతాల ద్వారా కార్పొరేషన్‌ ఆదాయం మొత్తం ప్రైవేట్‌ పరం అయ్యాక, లోటును భర్తీ చేసుకునేందుకు విజయనగరంలోని 3 లక్షల మంది ప్రజలపై అదనపు ఆస్తి పన్నులు, యూజర్‌ ఛార్జీల భారం మోపడం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక మున్సిపల్‌ అధికరాలు పట్టించుకోక, ప్రైవేటు ఏజెన్సీలు అరకొర నిర్వహణతో వదిలేస్తే, నగరంలో పౌరుల ఆస్తుల విలువ దెబ్బతినే ప్రమాదం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement