విజయనగరం: ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్త సమ్మె చేయటానికి వెనుకాడేది లేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ హెచ్చరించారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో పని చేస్తున్న 8 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ జోనల్ సెక్రెటరీ బీకే మూర్తి మాట్లాడుతూ ఆర్టీసీలో థర్డ్ పార్టీ విధానం వల్ల కార్మికులు చాలా నష్టపోతున్నారని ప్రతి ఒక్క కాంట్రాక్టర్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నుంచి రూ.4000 వరకు కోత విధిస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎ.అశోక్ మాట్లాడుతూ కార్మిక శాఖ నిర్ణయించిన జీతాలు రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో ఏ కార్మికుడు అందుకునే పరిస్థితి లేదన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారించకుంటే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. విజయనగరం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో ప్రెసిడెంట్ కేఎన్ స్వామి, ఏపీపీటీడీ ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు తిరుపతిరావు, జిల్లా ట్రెజరీ శివ అత్యధిక సంఖ్యలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ డిమాండ్


