● సన్‌రే రిసార్ట్సు యజమాని రాజబాబుపై బాధితుల ఆరోపణ
● రాజబాబు ఫిర్యాదుతో బాధితులపై కేసులు
● ఇదేం న్యాయం అంటూ బాధితుల ఆందోళన
పూసపాటిరేగ : భోగాపురం మండలం కంచేరు రెవెన్యూ పరిధిలో భూ వివాదం నేపథ్యంలో భూహక్కుదారులు ఆందోళనకు దిగారు. కంచేరు రెవెన్యూ పరిధిలో తమ భూములలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కంచేరు రెవెన్యూ పరిధిలో కాకర్లపూడి సుగణకుమారికి చెందిన 15.455 ఎకరాల భూమిని 2021 మార్చిలో ఎలాన్ కన్‌స్ట్రక్సన్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు అభివృద్ధికి ఒప్పందం ద్వారా అప్పగించారు. భూమిని అభివృద్ధి చేసి ఒప్పందం మేర వాటాలు పంచుకునేలా, 36 నెలలులో అభివృద్ధి పూర్తి చేయాలనే నిబంధనలతో ఒప్పందం చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. అయితే ఒప్పంద గడువు పూర్తయినప్పటికి ఆయా భూములలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని బాధితులు ఆరోపించారు. ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను పలుమార్లు సంప్రదించి, భూమిని తిరిగి అప్పగించాలని కోరినట్లు తెలిపారు. స్పందన లేకపోవడంతో గత నెల 26న కంపెనీకి లీగల్ నోటీసు ఇచ్చినప్పటికి సమాధానం రాలేదని బాధితులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 31న తమ భూములు వద్దకు వెళ్లి అభివృద్ధి పనులు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. తమని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, స్టేషన్‌లో రాత్రి పొద్దుపోయే వరకు ఉంచి కేసులు నమోదు చేసినట్లు బాధితులు తెలిపారు. కేసులు నమోదైన వారిలో ఇద్దరు న్యాయవాదులు కూడా వున్నారన్నారు. తమ భూములను అభివృద్ధి కోసం ఇచ్చి ఒప్పందం ప్రకారం పనులు జరగలేదని ప్రశ్నించినందుకు తమపైనే కేసులు నమోదు చేయడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోవాలని బాధితులు కోరారు. సమావేశంలో తిరుమలరాజు శాలిని, తిరుమలరాజు జయకర్, తిరుమలరాజు దినకరవర్మ, తిరుమలరాజు సాకేత్ తదితరులు పాలొన్నారు.


