● మలేరియా కేసులే అధికం
● ఏడాది ఆరంభం నుంచి...
విజయనగరం ఫోర్ట్:
జిల్లాపై జ్వరాలు పంజా విసురుతున్నాయి. మలేరియా, వైరల్ జ్వరాల వ్యాప్తితో జనం విలవిలలాడుతున్నారు. ఏ ఆస్పత్రి చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. జ్వరాల వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండడం వైద్యవర్గాలను సైతం కలవరపెడుతోంది. ఇటీవల ఎస్.కోట మండలం బొడ్డవర పంచాయతీ పరిధిలోని బొడ్డపాడు గ్రామానికి చెందిన దుంబర అనితరాణి అనే మూడేళ్ల చిన్నారి జ్వరంతో మృతి చెందడం జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా నమోదయ్యే మలేరియా జ్వరపీడిత కేసులు ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో నమోదుకావడం వైద్యులను విస్మయపరుస్తోంది.
ఈ ఏడాది జనవరి నెల నుంచే జ్వరాల వ్యాప్తి ప్రారంభమైంది. 8 నెలల వ్యవధిలో లక్షలాది మంది జ్వరాలబారిన పడ్డారు. వైరల్ జ్వరంతో కొందరు, మలేరియాతో మరికొందరు, డెంగీ, టైఫాయిడ్‌తో ఇంకొందరు అస్వస్థతకు గురవుతున్నారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, సర్వజన ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జనవరి నెల నుంచి ఆగస్టు 28 నాటికి జిల్లాలో 3లక్షలపైగా జ్వరపీడిత కేసులు నమోదైనట్టు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి.
జిల్లాలో ఈ ఏడాది మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది మలేరియా కేసులు ఎక్కువగా నమోదుకావడం కలవరపెడుతోంది. 2025లో జనవరి నుంచి డిసెంబర్ వరకు 390 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది ఆగస్టు 28 నాటికి 561 కేసులు నమోదయ్యాయి. ఈఏడాది ఆగస్టునాటికి 242 కేసులు అధికంగా నమోదుకావడం గమనార్హం. డెంగీ కేసులు గతేడాది 85 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది ఆగస్టు 28 నాటికి 45 కేసులు నమోదయ్యాయి. జ్వరాల కట్టడికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ముందుస్తు చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటి సర్వేతో జ్వరపీడితులను గుర్తించి సకాలంలో వైద్యసేవలు అందించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
జ్వరాల కట్టడికి చర్యలు
జ్వరాల వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే కూడా చేస్తున్నారు. జ్వరాలు ఎక్కువగా నమోదైన చోట వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నాం.
– డాక్టర్ ఎస్.జీవనరాణి
డీఎంహెచ్‌ఓ
జిల్లాలో మలేరియా, వైరల్
జ్వరాల వ్యాప్తి
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
గతేడాది కంటే పెరిగిన
జ్వరపీడిత కేసులు


