● యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
● ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి
గోపాలకృష్ణ
విజయనగరం గంటస్తంభం: అర్హుత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా పకడ్బందీగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని సూచించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటును నోటీసు ఇవ్వకుండా తొలగించబోమని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై శుక్రవారం కలెక్టరేట్‌లో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అబ్జర్వర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో సర్ ప్రక్రియ పురోగతిని వివరించారు. మ్యాపింగ్ కాని, ఎనామలీస్‌కు సంబంధించి సుమారు 1,93,734 మందికి నోటీసులు అందజేశామని తెలిపారు. వారి నుంచి వివరణ తీసుకున్న అనంతరమే ఓటుకు సంబంధించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రెండు రోజులూ బీఎల్‌ఓలు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఫారం– 6,7,8 లు కూడా అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ, ఈసారి 2004 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేస్తూ ప్రత్యేకంగా ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే ముసాయిదా జాబితాను ప్రచురించామని, మార్పులు, చేర్పులు, అభ్యంతరాల పరిశీలన అనంతరం అక్టోబర్ 3న తుదిజాబితా ప్రచురిస్తామని చెప్పారు. కొత్తగా అర్హత పొందిన ఓటర్లను గుర్తించి జాబితాలో చేర్చాలని, జిల్లాలో సుమారు 82 వేల మంది యువ ఓటర్లను జాబితాలో చేర్చాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం స్వీప్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి యువతకు అవగాహన కల్పించాలన్నారు. పీవీటీజీలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి కూడా ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఈపీ రేషియో(జనాభాలో ఓటర్ల శాతం) 630గా ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, మరింత పెంచేందుకు కృషి చేయాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సూచనలు, అభ్యంతరాలను తన దృష్టికి నేరుగా తీసుకురావచ్చని తెలిపారు.
● జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ మాట్లాడుతూ, ఈపీ రేషియోను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్‌ఐఆర్(సర్)కు సంబంధించిన వివిధ యాప్‌లపై విస్తృతంగా అవగాహన కల్పిస్తామని, యువ ఓటర్ల కోసం స్వీప్ కార్యక్రమాలు, ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ ఎం.అరుణకుమారి, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


