విజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి నాలుగో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ టి.వి.గిరి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ‘సబ్‌మిషన్స్.ఓపీ.జీఓవీ.ఐఎన్/ఐటీఐ’ వెబ్‌సైట్‌లో ఈ నెల 31వ తేదీన ఉదయం 11.30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదేరోజు ఉదయం 11.30 తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం సెల్: 83090 54418, 63007 68405 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
విజేతకు ఎస్పీ ప్రశంస
విజయనగరం టౌన్: నెల్లిమర్ల మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన శనపతి గురునాయుడు ఇటీవల ఉజ్జికిస్తాన్ దేశం తాష్కెంట్‌లో జరిగిన జూనియర్ ఏషియన్ చాంపియన్ షిప్–2026 వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మూడు రజత పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఆయనను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. క్రీడా ప్రతిభను ప్రశంసించారు. కార్యక్రమంలో రవిశంకర్, అజయ్‌బాబు, నాగేశ్వరరావు, సన్యాసప్పడు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
సిరిమానోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
● సాధారణ భక్తుల దర్మనాలకు
అంతరాయం లేకుండా చూడాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం గంటస్తంభం: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఈ సారి వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 25, 26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 27న సిరిమానోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిరిమానోత్సవం నిర్ణీత సమయానికే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 11 గంటలకే సిరిమానును అమ్మవారి ఆలయం వద్దకు చేర్చేలా చూడాలన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రతేక దృష్టి సారించడంతోపాటు ఎల్‌ఈడీ స్క్రీన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. శాఖలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసి ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ, ఈ ఏడాది అమ్మవారి పండుగకు సుమారు 3.5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దానికి అనుగుణంగా బారికేడ్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్వో ఎం.అరుణకూమారి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నాలుగైదు రోజుల్లో
కొత్తభవనాల్లోనే సేవలు
గుమ్మలక్ష్మీపురం: భద్రగిరి సీహెచ్‌సీ కొత్తభవనాలు నాలుగైదు రోజుల్లో అందుబాటులోకి వస్తాయని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నాగభూషణరావు తెలిపారు. ఈనెల 27న ‘సెల్‌ఫోన్ వెలుగులో బాలుడికి వైద్యం’ 28న ‘అరకొర బెడ్‌లు..రోగులకు తప్పని వెతలు’ శీర్షికన ప్రచురితమైన వార్తలకు డీసీహెచ్‌ఎస్‌తో పాటు ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ భారతి స్పందిచారు. శుక్రవారం భద్రగిరి సీహెచ్‌సీని పరిశీలించారు. పాత, కొత్త భవనాల్లో రోగులకు అందుతున్న, అందించాల్సిన వైద్య సేవలు, కల్పించాల్సిన సదుపాయాలపై ఆరా తీశారు. డ్రైనేజీ, నీటి సౌకర్యం, జనరేటర్ వంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయని, నాలుగైదు రోజుల్లో పనులు పూర్తిచేసి, నూతన భవనాల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.


