● భూ సమస్యలు పరిష్కారం కాకుండా పనులు చేయడంపై రైతులు ఆగ్రహం
రామభద్రపురం: తామంతా మూకమ్మడిగా చావనైనా చస్తాం గాని ఏళ్ల తరబడి జీవనాధారంగా ఉన్న భూములను ఇచ్చేది లేదని గిరిజన రైతులు తేల్చిచేప్పారు. భూ సమస్యలు పరిష్కరించకుండా రాధిక వెజిటబుల్స్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు జేసీబీతో శుక్రవారం భూమి చదును పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పనులను అడ్డుకున్నారు. దశాబ్దాలుగా జీడితోటలు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నామని, భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొట్టక్కి రెవెన్యూ మిర్తివలస పంచాయతీ పరిధి లో ని కాకర్లవలస, కారేడువలస గ్రామాల మధ్య ఉన్న భూమిని 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం నెలిపర్తి పంచాయతీ పుల్లేరుగుడ్డివలస గ్రామానికి చెందిన 17 మంది గిరిజన రైతులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చింది. అదే ప్రాంతంలో 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు 187.08 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి విక్రయించగా, అందులో ఏపీఐఐసీ అధికారులు రాధిక వెజిటబుల్స్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సర్వే నంబర్ 717లో 64.67 ఎకరాలను విక్రయించారు. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు తలపెట్టిన నిర్మాణ పనులను గిరిజన రైతులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ అజూ రఫీజాన్, ఎస్‌ఐ జ్ఞానప్రసాద్ పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులకు సర్దిచెప్పేప్రయత్నం చేసినా భూములు వదులుకునేది లేదని తేల్చిచెప్పారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మామిడితోటలు, జీడితోటలు, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేసిన రాధిక వెజిటబుల్స్ ప్రతినిధులతో నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. కొద్దిరోజులు పనులు ఆపాలని రాధిక వెజిటబుల్స్ ప్రతినిధులకు తహసీల్దార్ సూచించి వెనుదిరిగారు.


