వాతావరణంలోని మార్పులవల్లే జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వైరల్ ఫీవర్స్ బారిన జనం పడుతున్నారు. ఎండతీవ్రత పెరిగినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండలో తిరగకూడదు. ఎండలోకి వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ వంటివి ధరించాలి. చిన్న పిల్లలు, వృద్ధులు ఎండలో తిరగకుండా చూసుకోవాలి. ఓఆర్‌ఎస్ ద్రావణం, నీరు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. జ్వరం, దగ్గు జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే గ్రామంలో ఉన్న ఎంఎల్‌హెచ్‌పీ, లేదంటే పీహెచ్‌సీ వైద్యుడిని సంప్రదించాలి. జ్వరతీవ్రత ఎక్కువగా ఉంటే ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు తీసుకెళ్లాలి.
– డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్‌ఓ
● అదే మండలానికి చెందిన అశ్విని అనే మహిళకు జ్వరం, వాంతులు కావడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు వైరల్ ఫీవర్‌గా నిర్ధారించి చికిత్స అందించారు.
● గంట్యాడ మండలానికి చెందిన మౌళి అనే బాలుడు జ్వరం, తలనొప్పి బారిన పడడంతో కుటుంబ సభ్యులు విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి మంగళవారం తీసుకువెళ్లారు. బాలిడిని పరీక్షించిన వైద్యుడు వైరల్ ఫీవర్‌గా నిర్ధారించి మందులు అందజేశారు.
విజయనగరం ఫోర్ట్:
జిల్లా ప్రజలు అధికమంది జ్వరాల బారినపడుతున్నారు. వీరితో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. జనవరి నెల నుంచే జ్వరాల వ్యాప్తి ఆరంభమైంది. ప్రస్తుతం రోగుల సంఖ్య అమాంతం పెరిగింది. సాధారణంగా మే, జూన్ నెల నుంచి జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ ఏడాది ఆరంభం నుంచే వ్యాప్తి అధికంగా ఉంది. జ్వరాలబారిన పడినవారు కొంతమంది పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరి కొంతమంది సర్వజన ఆస్పత్రిలో సేవలు పొందుతున్నారు. వాతావరణంలో మార్పులు, కలుషిత తాగునీరు వంటివి జ్వరాల వ్యాప్తికి ప్రధాన కారణమని వైద్యులు నిర్ధారిస్తున్నారు.
● వృద్ధులు, పిల్లలపైనే అధిక ప్రభావం..
గ్రామీణ ప్రాంతాలతో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ జ్వరాల కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు. వైరల్‌పీవర్స్‌తో పాటు, టైఫాయిడ్, మలేరియా, కామెర్లు వంటి వ్యాధులతో అస్వస్థతకు గురవుతున్నారు. వసతిగృహాల్లో ఉన్న విద్యార్థులనూ జ్వరాలు వెంటాడుతున్నాయి.
వాతావరణంలో మార్పులే కారణం..
ఈ ఏడాది తొందరగా జ్వరాల వ్యాప్తికి వాతావరణంలో మార్పులే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరాలతో అధికమంది బాధపడుతున్నారు. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో జనవరి, ఫిబ్రవరి నెలలో 48,801 జ్వరపీడిత కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఉన్న 300 ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 50 వేలు పైబడి జ్వర కేసులు నమోదైనట్టు సమాచారం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీచేస్తున్నారు.
అప్పుడే ప్రారంభమైన జ్వరాల వ్యాప్తి
గతనెల నుంచే అధికం
రెండు నెలల్లో లక్ష జ్వరపీడిత కేసుల నమోదు
వాతావరణంలో మార్పులే
కారణమంటున్న వైద్యులు


