అక్రమాలకు ‘రెవెన్యూ’ | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు ‘రెవెన్యూ’

Feb 25 2026 10:38 AM | Updated on Feb 25 2026 10:38 AM

అక్రమ

అక్రమాలకు ‘రెవెన్యూ’

అక్రమాలకు ‘రెవెన్యూ’ పత్రాలు మంజూరు చేయాలన్నా.. అనుమతులివ్వాలన్నా..

కంచే చేను మేసిన చందాన..

సాక్షి, పార్వతీపురం మన్యం:

నీటుగా డ్రెస్సు.. చెదరని క్రాపు.. సూటూబూటు.. బుద్ధిమంతునిలా కళ్లజోడు! అచ్చంగా మంచితనానికి, నిజాయితీకి బ్రాండ్‌ అంబాసిడర్ల మాదిరి కనిపిస్తారు. లోపల మాత్రం మరో ‘లంచావతారి’ అంతర్లీనంగా ఉంటాడు. అసవరమైన సందర్భంలో బయటకు వస్తాడు. వీరికి ప్రజాసేవ కోసం ప్రభుత్వం రూ.లక్షల్లో జీతమిస్తోంది. అయినా, పేదలే. ఎంతలా అంటే.. ఏ పూట తిండికి, ఆ పూటే వెతుక్కునే రైతుల నుంచి కూడా రూ.లక్షలు డిమాండ్‌ చేసేంత పేదవారు!! ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారుతున్నాయి. కొంత మంది అవినీతి అధికారులు, ఉద్యోగుల కారణంగా ఏకంగా ఆ శాఖకే ఈ మచ్చ అంటుతోంది. ఇటీవల కాలంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో జరుగుతున్న ఏసీబీ దాడులు కలకలం పుట్టిస్తే.. వారి సోదాల్లో అవినీతి దొంగల నుంచి పట్టుబడిన నగదును చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెచ్చుమీరుతోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, మున్సిపల్‌, పోలీస్‌, విద్య, వైద్యం, ట్రెజరీ అనే తేడా లేదు.. ఏ శాఖ చూసినా అవినీతి దందానే! అక్రమార్జనకు అలవాటు పడిన కొంతమంది ఉద్యోగులు.. ప్రతి పనికీ ఓ రేటు కట్టేసి, జలగల్లా పీడించేస్తున్నారు. దీనికి ఇటీవల నమోదైన ఏసీబీ కేసులే నిలువెత్తు నిదర్శనం.

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని విజయనగరం, కొత్తవలస, ఎస్‌.కోట, భోగాపురం, పూసపాటిరేగ, పాలకొండ, పార్వతీపురం, సాలూరు తదితర ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. వీటి రిజిస్ట్రేషన్ల ద్వారా అటు ప్రభుత్వానికే కాక.. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికీ భారీగా ఆదాయం లభిస్తోంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అధికారులు అడిగింది ఇస్తే.. అంతా వారే చూసుకుంటారు. ఇవ్వకపోతే.. ఎన్నిసార్లు తిరిగినా దస్త్రం కదలదు. డాక్యుమెంటేషన్‌లో తప్పులున్నాయంటూ తిప్పి పంపుతుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రయవిక్రయదారుల పదిసార్లు తిరగలేక, మధ్యవర్తులను/డాక్యుమెంట్‌ రైటర్లను ఆశ్రయించి, రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు.

● గత ఏడాది చివర్లో భోగాపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. సబ్‌ రిజిస్ట్రార్‌ పి.రామకృష్ణ, కార్యాలయ ఆఫీస్‌బాయ్‌ కనకరాజు ఇళ్లలో సోదాలు చేశారు. కనకరాజు ఇంట్లో రూ.18 లక్షల మేర నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. విజయనగరంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ ఇంటిలోనూ సోదాలు జరపగా.. రూ.3 కోట్ల విలువ చేసే భవన డాక్యుమెంట్లు, రూ.25 లక్షల నగదు, రూ.200 గ్రాముల బంగారం అక్రమంగా సంపాదించినట్లు గుర్తించారు.

● గతంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ కమిషనర్‌గా పనిచేసిన సామంచి సర్వేశ్వరరావు రూ.20 వేలు లంచం తీసుకుంటూ, అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఒక మహిళ తన బిడ్డకు సంబంధించి జనన ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేయగా.. మంజూరు కోసం ఈ మొత్తం డిమాండ్‌ చేయడం గమనార్హం.

● గతేడాది సాలూరు మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ జయరామ్‌, మరో అధికారిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేపట్టారు. సాలూరు, పార్వతీపురం వంటి మున్సిపాలిటీల్లోనూ, పాలకొండ వంటి నగర పంచాయతీల్లోనూ ప్రణాళికా విభాగంలో లంచావతారాలు ఉన్నాయి. భవన నిర్మాణదారుల నుంచి అనుమతుల కోసం భారీగా వసూలు చేస్తున్నట్లు వినిపిస్తోంది.

● ఐటీడీఏల్లోనూ సీఆర్‌టీల రెగ్యులర్‌, ఉపాధ్యాయుల బదిలీ, అక్రమ డిప్యుటేషన్ల విషయంలో పెద్ద ఎత్తున నగదు డిమాండ్‌ చేస్తున్నారు.

● విద్య, వైద్యశాఖల్లోనూ పోస్టుల భర్తీ, ఉద్యోగులకు సెలవుల మంజూరు, వివిధ అనుమతుల కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ శాఖ.. ఆ శాఖ అనే తేడా లేకుండా ప్రతిచోటా కొంతమంది కార్యాలయాల్లో చక్రం తిప్పుతూ, అవినీతి మేతకు అలవాటు పడ్డారు. దొరకనంత వరకూ వీరు దొరలే. దొరికాకే.. దొంగలుగా సమాజం ముందు నిలుస్తున్నారు. వీరి లంచావతారాలతో సామాన్యులు నలిగిపోతున్నారు. తమ పనుల కోసం కార్యాలయానికి వెళ్లేందుకు భయపడుతున్నారు.

విజయనగరం జిల్లాకు చెందిన నెట్టి శ్రీనివాసరావు 2010లో జిల్లా పోలీస్‌ శాఖలో హోంగార్డుగా విధుల్లో చేరాడు. తర్వాత ఏసీబీలోకి మకాం మార్చాడు. ఎంతో నమ్మకంతో పని చేసేవాడు. ఎంత నమ్మకంగా అంటే.. ఏసీబీ అధికారులు ఎక్కడైతే దాడులు చేయనున్నారో.. అక్కడి అధికారులకు, ఉద్యోగులకు ముందే సమాచారమిచ్చేంత! అందుకు ప్రతిఫలంగా ఈయనకు భారీ స్థాయిలో నగదు, విలువైన ఆస్తులు ముట్టేవి. ఇతని ఆస్తుల విలువ రూ.20 కోట్లకుపైగానే. ఇటీవల ఏసీబీ అధికారులు ఈయన అక్రమాలను బయటపెట్టారు. కంచే చేను మేసిన చందాన.. సొంత శాఖలోని అధికారులకే ఈయన వెన్నుపోటు పొడవడం విశేషం.

రిజిస్ట్రేషన్‌కు ‘స్థిరాస్తే’!

ప్రతిపనికీ లంచం.. లంచం.. లంచం..

అవినీతి దొంగలు.. దొరక్కపోతే దొరలు!

ప్రభుత్వ శాఖలను పట్టిపీడిస్తున్న అవినీతి జలగలు

తరచూ ఏసీబీ దాడులు జరుగుతున్నా.. వెరవని లంచావతారులు

సేవపొందాలంటేనే భయపడుతున్న జనం

తండ్రి మరణానంతరం వారసత్వంగా పొందాల్సిన 74 సెంట్ల భూమి.. అందుకు అన్ని అర్హతలూ ఆ రైతు వద్ద ఉన్నాయి. నిబంధనల ప్రకారం తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం, ఇతర ఆధారాలతో మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు. తన హక్కు కోసం విన్నవించుకుంటే.. లంచం ఎవరికి ఇవ్వాలి? 74 సెంట్ల భూమి ఉన్న రైతు.. రూ.3 లక్షలు ఎక్కడ నుంచి తేగలడు? ఈ అవినీతి భాగోతం ఒక్క వీఆర్వో దగ్గరే ఆగిపోతుందా? దస్త్రంపైకి వెళ్లిన కొద్దీ.. అధికారులూ మారుతుంటారు. వారి చేయి తడపనిదే రైతు పని జరిగిపోతుందా? విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో చాకివలస ఇన్‌చార్జి వీఆర్వో రెవెన్యూ పరమైన మ్యుటేషన్‌ పనులు చేసేందుకు రైతు బంగారునాయుడు నుంచి రూ.3 లక్షలు డిమాండ్‌ చేయడం గమనార్హం. రూ.2.40 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం కుదరగా.. రెండు రోజుల కిందట రైతు రూ.లక్ష అడ్వాన్సు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మ్యుటేషన్లు, పాస్‌ పుస్తకాల జారీ, ఆన్‌లైన్‌ చేయడం, బదిలీ, పేర్ల మార్పు, వారసులకు బదిలీ ఇలాంటి వ్యవహారాల కోసమే ఎక్కువగా రైతులు రెవెన్యూ కార్యాలయాలను ఆశ్రయిస్తారు. వారి అవసరాలను అడ్డం పెట్టుకుని.. రెవెన్యూ సిబ్బంది అడ్డంగా దోచేస్తున్నారు. ఆ ప్రాంతంలో భూముల ధరలకు అనుగుణంగా లెక్క కట్టి.. పైకం వసూలు చేస్తున్నారు. వీరి ధన దాహం రూ.వేల నుంచి రూ.లక్షలకు చేరుకోవడం గమనార్హం. గతంలో ఇటువంటి అవినీతి ఆరోపణల కారణంగానే సాలూరు తహసీల్దారు సస్పెన్షన్‌కు గురయ్యారు. జియ్యమ్మలస తహసీల్దారు, పార్వతీపురం ఆర్‌ఐ సైతం ఏసీబీ వలలో చిక్కుకున్నారు. విజయనగరం జిల్లాలోని కొత్తవలస తహసీల్దార్‌, విజయనగరం మండల హెచ్‌డీటీ పట్టుబడ్డారు. ఇంక వీఆర్వోలైతే ఉమ్మడి జిల్లాలో లెక్కే లేదు.

అక్రమాలకు ‘రెవెన్యూ’ 1
1/2

అక్రమాలకు ‘రెవెన్యూ’

అక్రమాలకు ‘రెవెన్యూ’ 2
2/2

అక్రమాలకు ‘రెవెన్యూ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement