● పైడితల్లీ పాహిమాం..!
రాజాం/రాజాం సీటీ: భక్తుల పాలిట కల్పవల్లి.. పోలిపల్లి పైడితల్లి అమ్మవారి వందవ జాతర మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. పైడితల్లీ పాహిమాం అంటూ భక్తులు ప్రణమిల్లారు. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు. మొక్కుబడులు చెల్లించారు. వీఐపీ దర్శనాలు నిలుపుదల చేయడంతో రూ.20, రూ.50, రూ.100, ఉచిత దర్శనాల క్యూలు భక్తులతో కిక్కిరిశాయి. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. కొందరు పోలీసులు తమకు తెలిసిన వారిని వీవీఐపీ గేటు నుంచి విడిచిపెట్టడంతో మిగిలిన భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు అధికారులు అత్యుత్సాహంతో ఆలయ ప్రధాన అర్చకులను సైతం ఆలయం లోపలకి విడిచిపెట్టకపోవడం వివాదం రేగింది.
ఘనంగా ఘటోత్సవం
పైడితల్లి అమ్మవారి ఘటోత్సవం సాయంత్రం ప్రారంభం అయ్యింది. కొండంపేట నుంచి వాకచర్ల కుటుంబీకులు అమ్మవారి ఘటాలు, చెక్క ప్రతిమలు ఆలయానికి తీసుకొచ్చారు. ఊరేగింపుగా జరిగిన ఈ ఉత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు సాయంత్రం రాజాం చేరుకోవడంతో బొబ్బిలిరోడ్డు మొత్తం భక్తులతో కిటకిటలాడింది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలను పోలీసులు దారిమళ్లించారు.
ఆకట్టుకోని సాంస్కృతిక కార్యక్రమాలు
జాతర సందర్భంగా రూ.లక్షలు వెచ్చించి తీసుకొచ్చిన జబర్దస్ట్ ప్రొగ్రాం ప్రజలను నిరాశపరిచింది. ఓ వైపు చిన్నచిన్న చినుకులు, మరో వైపు నీరశపడిన హైపర్ ఆది టీం ఒక్క స్క్రిప్ట్ కూడా పక్కాగా చేయలేదు. లోకల్ డ్యాన్సర్లను ఏర్పాటుచేసి కార్యక్రమాన్ని మమ అనిపించారు. దీంతో ప్రేక్షకులు నిరుత్సాహపడ్డారు. ఈ జబర్దస్ట్ షో బుర్రకథ కంటే అధ్వానంగా ఉందంటూ విమర్శలు చేశారు. ఆలయం వద్ద ప్రైవేటు కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ సేవకులు భక్తులపై చిరాకుపడడంతో అసౌకర్యానికి గురయ్యారు. గర్భగుడిలోనూ కేకలు వినిపించాయి. వీటితో విసుగుచెందిన దేవదాయశాఖ ఈఓ మాధవరావు అస్వస్థతకు గురై కార్యాలయంలో ఉండిపోయారు. మరోవైపు పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ, గ్లూకోజ్ పానీయలు, బిర్యానీ, పులిహోరాలు అందించాయి.
● పైడితల్లీ పాహిమాం..!
● పైడితల్లీ పాహిమాం..!
● పైడితల్లీ పాహిమాం..!


