● ఎల్లారమ్మా..కరుణించమ్మా..
జామి:
‘శరణుశరణు ఎల్లారమ్మ తల్లీ.. నీకు శరణుశరణు
మర్రాకు పానుపట నీకు.. వనంలోనే ఉందువనెదురే
బాపనోరి పిల్లవందురే.. శరణు, శరణు నీకు శరణమమ్మ’
అంటూ జామి ఎల్లారమ్మను ఆనవాయితీగా జముకులపాటతో సోమవారం రాత్రి 9.30 గంటలకు అమ్మవారిని గద్దెదింపి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి భక్తులు తీసుకువచ్చారు. దారిపొడవున అమ్మవారికి జలాభిషేకాలు చేశారు. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో అమ్మవారిని లక్ష్మీస్వరూపిణిగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అమ్మవారి దర్శనానికి సుమారు రెండున్నర లక్షల మంది భక్తులు తరలిరావడంతో జామి జనసంద్రంగా మారింది. జామితో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఎల్లారమ్మ పండగను పెద్దపండగగా జరుపుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పలు స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, తాగునీరు, పులిహోరా, చక్కెరపొంగళి పంపిణీ చేశాయి. అమ్మవారి జాతర సజావుగా సాగేలా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.


